డబ్ల్యూహెచ్‌వో చైర్మన్‌గా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరణ
న్యూఢిల్లీ మే 23
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జపాన్‌కు చెందిన హిరోకి నకటాని పదవీకాలం ముగిసింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. డబ్ల్యూహెచ్‌వో విధానపరమైన నిర్ణయాల్లో కార్యనిర్వాహక బోర్డు కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డులో 34 సభ్యదేశాలు ఉంటాయి. మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సంక్షోభం నెలకొన్నదని, అలాంటి సమయంలో తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. రానున్న రెండు దశాబ్ధాలు ఆరోగ్య సవాళ్లు అనేకం ఉంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు అందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలన్నారు. డబ్ల్యూహెచ్‌వో కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత ప్రతినిధిని నియమించే ప్రతిపాదనకు 194 దేశాలు సభ్యులుగా ఉన్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ పదవికి భారత్‌ను నామినేట్ చేస్తూ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య గతేడాది ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ నియామకం లాంఛనప్రాయమే అయ్యింది.