YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

అప్పుడే క్లాసులు ప్రారంభించేశారు

అప్పుడే క్లాసులు ప్రారంభించేశారు

కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే విద్యార్థులకు వేసవి సెలవులే ఉండవనేది స్పష్టమవుతుంది. ఇంటర్ పరీక్షలు ముగిసి పదిహేనురోజులు కావస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయి వారం తిరగకముందే ప్రత్యేక క్లాసుల పేరుతో అప్పుడే క్లాసులు మొదలుపెట్టాయి. సెకండ్ ఇయర్ పోర్షన్ లో కొంత భాగాన్ని ఇప్పుడే కంప్లీట్ చేసేందుకు ముందస్తు తరగతులను తీసుకుంటున్నాయి.శ్రీ ఛైతన్య, నారాయణ కాలేజీలే కాకుండా వాటి అడుగుజాడల్లో నడుస్తున్న మిగతా కళాశాలలు కూడా విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోగానే సెకండియర్ క్లాసులు తీసుకుంటున్నాయి. కనీస విరామం ఇవ్వకుండా, మనశ్శాంతి లేకుండా పాఠాలు బోధిస్తున్నాయి. ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.  వేసవి సెలవుల్లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఇష్టానురాజ్యంగా కళాశాలలు నడుస్తున్నాయని చెప్పడానికి ఇది ఊదాహరణగా చెప్పవచ్చు. ఎంసెట్ క్లాస్‌ల పేరుతో నగరంలో ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ అధికారులకు సమ్మర్ మామూళ్లు ఇస్తూ యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నారనేది స్పష్టమవుతుంది.నిబంధనల ప్రకారం విద్యార్థులకు వేసవి సెలవులివ్వాలి. వారి మానసిక ఉల్లాసం కోసం చదువులకు విరామం ప్రకటించాలి. ప్రత్యేక క్లాసులు, క్రాష్ కోర్సుల పేరుతో ఎలాంటి క్లాసులు తీసుకోవద్దు. వీటిపై సర్కారు నిబంధనలు కూడా ఉన్నాయి. అయినా కార్పోరేట్ స్కూళ్లు ఆ నిబంధనలను చెవికెక్కించుకోవడం లేదు. ఇంటర్  ఫస్టియర్  పరీక్షలు అయిపోయి వారం కాలేదు అప్పుడే మళ్లీ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇన్నాళ్లూ బోర్డ్  ఎగ్జామ్స్ కోసం రాత్రీ పగలు కష్టపడి పుస్తకాల్లో మునిగిన పిల్లలు దాన్నుంచి బయటపడే అవకాశం కూడా ఇవ్వకుండా తరగతులు నడిపిస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. ఉదయం 8 గంటలకే మొదలవుతున్న క్లాసులు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో మాదిరిగా తరగతులను తీసుకుంటున్నాయి. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్ లేదా జేఈఈ లేక మరేదైనా కోర్సుల కోసం చదవడం, ప్రత్యేక క్లాసులకు వెళ్లడం ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు అలాంటి పరిస్థితే తీసుకొస్తున్నాయి కార్పోరేట్ కళాశాలలు. ఎండాకాలం సెలవులను గడపకుండా చేస్తున్నాయి. వారం రోజులు కూడా కాలేదు అప్పుడే కాలేజీకి క్యూ కడుతున్నారు. ఫ్రెండ్స్ అంతా సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తుంటే తాను మాత్రం క్లాసులు వినాల్సి వస్తుందని చెబుతున్న ఓ విద్యార్థి వ్యధ వర్ణనాతీతం. ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తూ క్లాసులు తీసుకోవద్దని ఇలాంటి తరగతుల నిర్వహణ వల్ల ఎదిగే పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కష్టపడి చదివిన పిల్లలకు కనీస విరామం ఇవ్వాలని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇంటర్ బోర్డు మార్చి 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. కానీ, నగరంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ బోర్డు నిబంధలను తుంగలో తొక్కాయి. సెలవుల్లోనూ ఇష్టానుసారంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి ఎంసెట్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకే కాకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులను సైతం సెంకండ్ ఇయర్ తరగతులకు హాజరుకావాలని యాజమాన్యాలు హుకుం జారీ చేయడంతో మండుటెండలో తరగతులకు హాజరవుతున్నారు. ప్రధానం గా హాస్టల్ వసతి ఉన్న కళాశాలలే సెంకండ్ ఇయర్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవు రోజుల్లో కళాశాలలు నడపకూడదు, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు ఉన్నత అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా తమకేమీ పట్టనట్లుగా ఆయా కళాశాలలు వ్యవహరిస్తున్నాయి. వేసవి కాలంలో ఇంటర్ తరగతులు నిర్వహించే కళాశాలల యాజమాన్యాలపై ఉక్కుపాదం మోపాల్సిన ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు కానీ, ప్రజాసంఘాలనుంచి కళాశాలలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు

Related Posts