YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైద్రాబాద్ లో బస్తీ దవాఖానలు ఢిల్లీ తరహాలో వైద్య సేవలుఅందించే ప్లాన్

హైద్రాబాద్ లో  బస్తీ దవాఖానలు ఢిల్లీ తరహాలో వైద్య సేవలుఅందించే ప్లాన్

పేదల ఆరోగ్యానికి భరోసా లభించింది. వైద్యం రోజురోజుకూ ఖరీదై పేదలకు అందని ద్రాక్షగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బస్తీ దవాఖానల పేరుతో వైద్య పరీక్షలతో సహా వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.హస్పిటల్స్ చుట్టు తిరుగుతూ.. లైన్లలో గంటలతరబడి నిలుచో వాల్సిన అవసరం లేదు. ఎందుంటే ఇక మీ బస్తీకే దవాఖానాలు రానున్నాయి. తెలంగాణ రాజధానిలో కొత్తగా సిటీ హస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నారు. జనాభాలో మూడో వంతు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉంది. దీంతో ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ కష్టంగా మారుతోంది. ముఖ్యంగా బస్తీవాసులు సరైన వైద్య సదుపాయాలకు నోచుకోవడం లేదు. అలాంటి 1,400 మురికివాడలను అధికార యంత్రాంగం గుర్తించిందిప్రయోగాత్మకంగా తొలుత 50 దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. నగరాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌ శాఖలు సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లకు తలదన్నే విధంగా మందులు సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మొదటి దశలో 40 బస్తీ దవాఖానలను సిద్ధం చేయగా అందులో 17 ప్రాంతాల్లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి.వైద్యం సేవలు ఇక మరింత దగ్గరకానున్నాయి.  భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో వెయ్యి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే నగరంలో మూడంచెల విధానంలో వైద్య సేవలు అందించనున్నారు. నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో ‘ఆరోగ్య హైదరాబాద్‌’లక్ష్యంగా సిటీలో మెరుగైన వైద్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు వైద్య ఆరోగ్య, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల పద్ధతిన వైద్య వ్యవస్థ కొనసాగుతోంది. కానీ హైదరాబాద్‌లో వైద్య సేవల నిర్వహణపై కొంత గందరగోళం ఉంది. అందుకే ప్రజలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మూ డంచెల పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. . ఈ ఆసుపత్రులను 50 బస్తీల్లో విజయవంతంగా నిర్వహించిన తర్వాత నగరవ్యాప్తంగా మరో వెయ్యి దవా ఖానాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం 145 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటికితోడు 30 సర్కిళ్లకు ఒక్కోటి చొప్పున కొత్తగా మరో 30 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఐదు జోన్లకు ఒక్కోటి చొప్పున ఐదు ప్రాంతాల్లో 100 పడకల స్థాయిలో ఏరియా ఆస్పత్రులను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ, గ్రేటర్ హైద్రాబాద్ కార్పొరేషన్ సమన్వయంతో కొత్తగా ‘హైదరాబాద్‌ హెల్త్‌ సొసైటీ’ఏర్పాటు చేశారు.సబ్‌ సెంటర్ల తరహాలో బస్తీ దవాఖానాలు,కమ్యూనిటీ హుల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు ఉండాలని నిర్ణయించారు. వీటిలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్క వైద్యశాల లేని బస్తీలు 50 దాకా ఉన్నాయి. తొలుత వీటిలోనే పైలట్‌ ప్రాజెక్టుగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రులలో డాక్టర్, స్టాఫ్‌ నర్సు, నర్సు అందుబాటులో ఉంటారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులను ఇస్తారు. అంతకు మించిన వైద్య సమస్యలు ఉన్న వారిని సమీపంలోని సీహెచ్‌సీలకు, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తారు.మల్కాజ్‌గిరిలోని బీజేఆర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ మొదటి బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఫలక్‌నుమాలోని హషిమాబాద్, మలక్‌పేట్‌లోని గడ్చిఅన్నారంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్. సి. లక్మారెడ్డి తదితరులు బస్తీ దవాఖానలను ప్రారంభించారు. వీటితోపాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎర్రకుంట(కాప్రా), రంగనాయకులగుట్ట (హయాత్‌నగర్), జీహెచ్‌ఎంసీ హౌసింగ్ బోర్డు (ఉప్పల్), ఇందిరాగాంధీపురం (మూసాపేట్), నందనవనం (ఎల్బీనగర్), బీజేఆర్‌నగర్(మల్కాజ్‌గిరి), ఎల్లమ్మబండ, బరియల్ గ్రౌండ్(కూకట్‌పల్లి), అలాగే, హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రశాసన్‌నగర్(జూబ్లీహిల్స్), నర్కీఫూల్‌బాగ్(ఫలక్‌నుమా), అరుంధతీనగర్(అంబర్‌పేట్), బాకారం(ముషీరాబాద్), గంగానగర్(అంబర్‌పేట్), మలక్‌పేట్ , చాచానెహ్రూనగర్(అంబర్‌పేట్), శ్యామ్‌లాల్ బిల్డింగ్(బేగంపేట్) తదితర చోట్ల బస్తీ దవాఖానలు ప్రారంభమయ్యాయి. ప్రతీ పదివేలమందికి ఒకటి చొప్పున నగరంలో 1000 బస్తీ దవాఖానలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దశల వారీగా వీటిని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

Related Posts