ఆగస్టులోపు అంతర్జాతీయ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ, మే 23,
దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి పునఃప్రారంభం కానుండగా.. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది పౌరవిమానయాన శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు.ఆగస్టులోపు అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శనివారం స్పష్టం చేశారు. దేశీయ విమాన సర్వీసుల పునఃప్రారంభిస్తామని ప్రకటించిన మూడు రోజుల తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభం కాకపోతే.. ఆగస్టు లేదా సెప్టెంబరుకి ముందు అంతర్జాతీయ పౌర విమానయాన కార్యకలాపాల ప్రారంభానికి ప్రయత్నిస్తామని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.కచ్చితంగా ఏ తేదీన పునఃప్రారంభిస్తామని చెప్పలేను.. కానీ, ఆగస్టు లేదా సెప్టెంబరులోగా ప్రారంభమవుతాయని ఎవరైనా చెబితే, పరిస్థితిని బట్టి అంతకు ముందే ఎందుకు కాకూడదని నా అభిప్రాయం’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసుల ప్రారంభమవుతాయని పునరుద్ఘాటించారు. శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి విమానాలు లేదా నౌకల ద్వారా తరలిస్తామని.. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు.ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ ఉన్న ప్రయాణీకుల క్వారంటైన్‌పై అవగాహన అవసరమని అన్నారు. వందే భారత్ మిషన్ తొలి దశలోని 25 రోజుల్లో 50వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. కాగా, తమిళనాడు, మహారాష్ట్రలు విమాన సర్వీసుల ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే కేంద్రం అన్ని ప్రాంతాలకు దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతాయని పునరుద్ఘాటించింది.అరోగ్యవంతులైన వృద్ధులను ప్రయాణానికి అనుమతిస్తామని, వారిని ఆపబోమని తెలిపారు. అలాగే, ఆరోగ్య సేతు యాప్ వినియోగంలోనూ స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి.. అది ఓ ప్రాధాన్యత మాత్రమేనని, తప్పనిసరేం కాదని పేర్కొన్నారు. దేశీయ విమాన సర్వీసుల ప్రారంభంపై కొంత ఆందోళన ఉండేదని అన్నారు.