YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేనాని..రెండు పడవలపై కాళ్లు

జనసేనాని..రెండు పడవలపై కాళ్లు

జనసేనాని..రెండు పడవలపై కాళ్లు
విజయవాడ, మే 25,
జనసేన పార్టీ పుట్టుక, పొత్తులు, రాజకీయం అంతా కూడా వింతగానే ఉంటోంది. ప్రపంచంలో ఎవరైన పార్టీ ఎందుకు పెడతారు, అధికారంలోకి రావడానికే. కానీ ప్రశ్నించడానికి ఒక పార్టీ పెట్టానని కొత్త భాష్యం చెప్పిన నాయకుడు పవన్ కల్యాణ్ ఒక్కరే ఉంటారేమో. పైగా తనకు అధికారం మీద మమకారం లేదని, తనది పాతికేళ్ళ సుదీర్ఘ ప్రయాణమని చెప్పి మరీ రాజకీయ ఓనమాలు దిద్దిన నాయకుడు కూడా పవనేనేమో. ఒక ఆరేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆరేడు పార్టీలతో పొత్తులు నెరపిన చరిత్ర కూడా జనసేనదే. ఇపుడు పొత్తు పార్టీతో కలసి అడుగులు వేయకుండా నిన్నటి మిత్రుడు టీడీపీ లైన్లో రాజకీయ ప్రయాణం చేయడమూ జనసేనాని పవన్ కల్యాణ్ లోని మరో కొత్త కోణం. ఏపీలో వైసీపీ సర్కార్ విషయంలో బీజేపీది, దాని మిత్రుడు జనసేనానిది భిన్న వైఖరులుగా ఉంది. జగన్ ని ఎంత విమర్శించినా కొన్ని విషయాల్లో మాత్రం బీజేపీ ఉన్నది ఉన్నట్లుగా మెచ్చుకున్న ఘటనలూ ఉన్నాయి. ఇటీవల విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో బాధితులకు మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల భారీ పరిహారం ఇవ్వడమే కాదు, పది రోజుల్లోనే మొత్తం బాధితులందరికీ పరిహారం అందించిన జగన్ని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ సైతం మెచ్చుకున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం సామర్ధ్యం పెంచుతూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో 203 విషయంలో కూడా బీజేపీ మద్దతు ఇవ్వడమే కాదు. రాయలసీమకు మేలు చేయలని గట్టిగా కోరింది.ఈ రెండు విషయాల్లో టీడీపీ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. కోటి రూపాయల‌ పరిహారం విషయంలో విపక్షాలు అన్నీ వైసీపీని మెచ్చుకున్నా కూడా టీడీపీ కానీ, దాని అధినాయకుడు చంద్రబాబు కానీ పెదవి విప్పలేకపోయారు. మంచి పరిహారం ప్రభుత్వం తక్షణ సాయంగా ఇస్తే కనీసం అది బాగుంది అనలేకపోయారు. పైగా కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలు తిరిగివస్తాయా అంటూ ఎకసెక్కమాడారు. ఇక పోతిరెడ్డిపాడు విషయంలోనూ చంద్రబాబు మౌనం పాటించారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ ది కూడా అదే రూటుగా ఉంది. సాయం చేసిన సర్కార్ ని మెచ్చుకుని పని చేయని చోట విమర్శలు చేస్తే వాటికి ఒక విలువ ఉండేది. మంచిని మెచ్చకుండా అదే పనిగా విమర్శలు చేస్తే జనం మెచ్చరు సరికాదా కక్ష అనుకుంటారు. చంద్రబాబుది అదే అని భావిస్తున్న జనం పవన్ కల్యాణ్ కూడా అదే రూట్లో వెళ్తున్నట్లుగా గట్టిగా నమ్ముతున్నారు.నిజానికి జనవరి నెలలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. కానీ ఈ రెండు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమం పెట్టుకుని ఇప్పటిదాకా చేసిన ఒక్క ఉద్యమం లేదు. అమరావతి రాజధాని విషయం నుంచి అన్నింటా రెండు పార్టీలదీ భిన్న ధోరణే. వికేంద్రీకరణకు బీజేపీ మద్దతు ఇస్తే అమరావతి ఒక్కటే రాజధాని కావాలని పవన్ కల్యాణ్ చంద్రబాబు పార్టీ వాయిస్ వినిపిస్తూ వచ్చారు. ఇక ఏపీలో జగన్ సర్కార్ చేస్తున్న మంచి పనులను కూడా స్వాగతించలేని అసహనంతో పవన్ కల్యాణ్ ఉన్నారని విశ్లేషణలు ఉన్నాయి. 2024లో రెండు పార్టీలు కలసి అధికారంలోకి వస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ కనీసం పొత్తు పార్టీ బాటలో నడవాలన్న ఆలోచన చేయకపోవడమే విడ్డూరమే. చూస్తూంటే మాజీ మిత్రుడు తెలుగుదేశం పార్టీ విధానాలే ఇప్పటికీ జనసేనకు నచ్చుతున్నాయనుకోవాలేమో. అందుకే విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా కూడా బాధితులను టీడీపీ మాదిరిగా రెచ్చగొట్టే పనికి జనసేనాని సిధ్ధమయ్యార‌ని విమర్శలు వస్తున్నాయి.

Related Posts