YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

తోబుట్టువులు*

తోబుట్టువులు*

తోబుట్టువులు*
భారతదేశ కుటుంబ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది, ఆదర్శవంతమైనది. పూర్వం, సమష్టి కుటుంబంలో తల్లిదండ్రులనీడలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కొడుకులు, కోడళ్లు అంతా కలిసి పరస్పరసహకారంతో, ప్రేమాభిమానాలతో పదిమందీ మెచ్చుకునే విధంగా, సుఖశాంతులతో, ఏ పొరపొచ్చాలు లేకుండా జీవితం కొనసాగించేవారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు సంప్రదించుకొంటూ తమంతట తామే పరిష్కారమార్గాన్ని తెలుసుకునేవారు. కాలాంతరాన సమష్టి కుటుంబాల సంఖ్య బాగాతగ్గి వ్యష్టి కుటుంబాల సంఖ్య పెరగడం మొదలైంది. అందుకు కారణాలనేకం. విద్య, ఉపాధి, వివాహం, వివాదం- ఏదైనా కావచ్చు. మానవసంబంధాలకు, అనుబంధ, బాంధవ్యాలకు విఘాతం ఏర్పడటం ఎంత మాత్రం వాంఛనీయం కాదు. భారతీయ కుటుంబాలకు కొన్ని మూలాలున్నాయి, విలువలున్నాయి. కుటుంబ బలమే ప్రేమను, ఐకమత్యాన్ని, ఖ్యాతిని పెంపొందించగలుగుతుంది. సమాజ శ్రేయానికి కుటుంబ శ్రేయమే బలమైన పునాది. ప్రధానంగా హైందవ కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లది ఎంతో కీలకమైన పాత్ర. వీరి ఐకమత్యం, అనురాగంమీదనే కుటుంబ గౌరవం, ఆధారపడిఉంది. ‘అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పరస్పరం  ద్వేషించుకోరాదు’ అని అధర్వణ వేదం చెబుతోంది. కలి ప్రవేశ ప్రభావంవల్ల తోబుట్టువుల మధ్య అకారణంగా లేదా, చిన్నచిన్న అపోహలవల్ల అసూయాద్వేషాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒకరు వేరొకరి కుటుంబ వినాశాన్ని కోరుకునే దౌర్భాగ్యస్థితి దాపురించింది కొన్ని కుటుంబాల్లో. వాళ్ల ‘అహం’ ముందు తల్లిదండ్రులు ఏమీ చేయలేని ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నారు. స్త్రీలైనా పురుషులైనా తోబుట్టువుల్లో స్నేహం, సఖ్యత, సౌహార్దతలు మృగ్యమైపోవడమేకాక- పరస్పర హానికి, అపకారానికి శతవిధాలైన కుట్రలు, ప్రయత్నాలు మితిమీరిపోతున్నాయి. ఒకప్పుడు లేఖలద్వారా ఉభయకుశలోపరి అనుకునేవారు. ఇవాళ సాంకేతిక సౌకర్యాలు ఎన్ని అందుబాటులోఉన్నా ఎందరో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పలకరించుకోవడమే లేదు. సహాయసహకారాల సంగతి దేవుడెరుగు, కనీసం యోగక్షేమాలు తెలుసుకుందామన్న ఆలోచన, ఆసక్తి కూడా కానరావడం లేదు. డబ్బు, హోదా, పదవి, కీర్తి, ప్రతిభ, విద్య- వీటిలో ఏదో ఒకటి అవరోధమవుతూనే ఉంది. వీటికితోడుగా అహంకారం ఆగ్నికి ఆజ్యంలా పరిణమిస్తోంది. వయోధికులైన కన్నవాళ్ల కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఆత్మీయతే కరవైపోతున్నది. పుట్టుకకు, మరణానికి మధ్య ఆ కన్నవాళ్లు ఎంతటి మానసికక్షోభను అనుభవిస్తున్నారో, ఎవరైనా గమనించగలుగుతున్నారా? ఆస్తుల పంపకాలు ఎంతో తేలిగ్గా జరిగిపోతాయి, కానీ తల్లి ఎవరి దగ్గర ఉండాలి, తండ్రి ఎవరి దగ్గర ఉండాలి అన్నది ఓ పట్టాన తేలని జటిలసమస్యగా ఎదురవుతున్నది పిల్లలకు. వారి సేవ మహాభారమైపోతోంది. తమ జన్మకు, ఇంతటి కీర్తికి, సుఖానికి కారకులైన తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలగడం ఎంతటి సుకృతమో గ్రహించడం లేదు. తమలో తాము కీచులాడుకోవడం, ముఖముఖాలు చూసుకోకుండా కక్షలు, కార్పణ్యాలు పెంచుకోవడం తోబుట్టువులైన వారికి ఏ మాత్రం సముచితం ఏమాత్రం ధర్మం? చాలా తరచుగా కుటుంబాల్లో ఇవాళ కనిపిస్తున్న క్షీణహీన దయనీయ స్థితి ఇది! గంజాయి వనంలో తులసిమొక్కల్లాంటి అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఈకాలంలోనూ లేకపోలేదు. ప్రకృతి నుంచి మనిషి ఎన్నోపాఠాలు నేర్చుకోవచ్చు. చెట్టుకున్న కొమ్మలుకాని, పూలు పండ్లు కానీ ఎన్నడూ తగాదా పడలేదు. నింగిలో చుక్కలు అన్నిఉన్నా ఒకదానితో ఒకటి పోట్లాడుకోలేదు. కొండలు ఒకదాన్ని మరోటి ‘ఢీ’ కొట్టవు. సూర్యచంద్రులు కలహించుకోలేదు. బతికున్నంతకాలం తోబుట్టువుల్లో ఒకరికొకరు ఆప్యాయత పంచుకోవాలి. ఆత్మీయత పెంచుకోవాలి.

Related Posts