హాల్ టిక్కెట్లతో సెట్ పరీక్షలు
హైద్రాబాద్, మే 25
ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర ఉమ్మడి ప్రవే శ పరీక్షల్లో(సెట్స్) బయోమెట్రిక్ హాజరు విధానం లేకుండానే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఇప్పటివరకు సేకరిస్తున్న బయోమెట్రిక్ (థంబ్ ఇంప్రెషన్) విధానాన్ని తొలగించాల ని నిర్ణయించింది. పరీక్షకు వచ్చే విద్యార్థుల్లో ఎవరి కైనా కరోనా ఉంటే థంబ్ ఇంప్రెషన్(వేలి ముద్రల సేకరణ)తో వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున ఈసారి థంబ్ ఇంప్రెషన్‌ను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థుల హాల్‌టికెట్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. దీంతో ఒకరికి బదులు మరొక రు పరీక్ష రాసే అవకాశం ఉండదు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌ను రద్దు చేస్తున్నందున హాల్‌టికెట్ల ఆధారంగా విద్యార్థుల పరిశీలనను జాగ్రత్తగా చేపట్టాలని నిర్ణయించింది. జూలై 1 నుంచి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించనుంది. జాతీయ స్థాయిలోనూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్‌ను తొలగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. బయోమెట్రిక్ వల్ల కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్, ఆగస్టులో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ బయోమెట్రిక్ లేకుండానే పరీక్షలు నిర్వహించనున్నారు.ఇక జాతీయ స్థాయి పరీక్షల్లో హాల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థి ఎదురుగా ఉండే మానిటర్‌పై కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కెమెరాలు ప్రతి ఐదు నిమిషాలకోసారి విద్యార్థి ఫొటోను ఆటోమెటిక్‌గా తీస్తాయి. జూలై 6 నుంచి సెట్స్ జూలై 6 నుంచి నిర్వహించే ఎంసెట్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 6, 7, 8 తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుందన్నారు. ఇక 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే 10న ఉదయం సెషన్ కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. 10న జరిగే లాసెట్‌కు విద్యార్థులు తక్కువే ఉంటారు కాబట్టి ఆ సదుపాయాలను కూడా దీనికి వినియోగించుకుంటామని చెప్పారు. ఇక రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్‌లో 25 వేల నుంచి 30 వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఎంసెట్‌కు 2,10,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,35,974 మంది ఇంజనీరింగ్ కోసం, 74,567 మంది అగ్రికల్చర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. కాగా, కామన్ ఎంట్రెన్స్ టెస్టŠస్ దరఖాస్తుల గడువు వచ్చే నెల పది వరకు పెంచినట్టు పాపిరెడ్డి తెలిపారు. జూన్ 20 నుండి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తామని, మొదట ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఇవి ముగిసిన వారం తర్వాత బ్యాక్ లాగ్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.