ప్రకృతి నష్టాలు..3 వేల కోట్లు
నల్గొండ, మే 25
ప్రకృతి వైపరీత్యాల వల్ల కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా.. దాని పరిహరం కోసం గత నాలుగేండ్లుగా రాష్ట్రప్రభుత్వం నివేదిక తయారు చేయడం లేదు. దీనివల్ల కేంద్రం నుంచి రావల్సిన నిధులు రాకుండా ఆగిపోతున్నాయి. ఖజానాకు దాదాపు రూ. 3,000 కోట్ల నష్టం జరిగింది. ధనిక రాష్ట్రమని గొప్పలకు పోయిన సర్కార్ కరువు మండలాలే లేవని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయని రైతుసంఘాలు మండిపడ్డాయి. ఏటా అతివృష్టి, అనావృష్టితో వేల కోట్లల్లో పంటలు నష్టం జరుగుతున్నది. అయినా నివేదికలను తయారు చేసి కేంద్రానికి పంపడంలో అలసత్వం ప్రదర్శిస్తుందన్న విమర్శలున్నాయి. తాజాగా కురిసిన వడగండ్ల వాన వల్ల వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు నేల మట్టం కావడంతో దాదాపు రూ. 1,500 వందల కోట్ల పంట దెబ్బ తింది. దీని విషయంలో ప్రభుత్వం పరిహారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఏటా అతివృష్టి, అనావృష్టి వల్ల జరిగిన పంట నష్టాలకు ప్రకృతి వైపరీత్యాల పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ అందుతుంది. జరిగిన పంట నష్టం, కరువుపై ఆయా రాష్ట్రాల్లోని రెవెన్యూ విభాగం క్షేత్రస్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిస్తుంది. రాష్ట్రం పంపిన నివేదిక ఆదారంగా కేంద్ర బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి జరిగిన నష్టంపై మరో నివేదికను సిద్ధం చేస్తోంది. ఈ నివేదిక ద్వారా కేంద్రం ప్రతి యేటా దేశంలోని అన్ని రాష్ట్రాలకు పరిహారాన్ని అందిస్తుంది. విపత్తుల నివారణ కింద ఇవ్వాల్సిన నిధులనే కేంద్రం రాష్ట్రాలకు అందిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేండ్లుగా కేంద్రానికి నివేదికలను పంపడం లేదు. ఫలితంగా దాదాపు రూ. 3,000 వేల కోట్ల మేర రాష్ట్రం కోల్పోయింది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2014-15 సంవత్సరంలో కరువు వల్ల రూ. 4,500 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక సమర్పించడంతో రూ. 618.49 కోట్లు, 2015-16 సంవత్సరంలో రూ. 3,506 కోట్ల నష్టానికి గాను రూ. 791 కోట్లను కేంద్రం నుంచి పరిహారంగా అందింది. ఆతర్వాత 2016-17 సంవత్సరం నుంచి ప్రకృతి వైపరీత్యాల పరిహారం కోసం ఎలాంటి నివేదికలను కేంద్రానికి పంపడం లేదు. కేంద్రం మాత్రం ప్రతి ఏటా కరువు మండలాలను ప్రకటిస్తూనే ఉంది.ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సగటున 300 మండలాలు కరువుకు గురవుతున్నాయి. అయినా తమది ధనిక రాష్ట్రమనీ, దేశంలోనే నెంబర్‌వన్ అని గొప్పలకు పోతుండటంతో రావాల్సిన నిధులు రావడం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ ప్రతి ఏటా కరువు పరిహారంగా రాష్ట్రానికి ఇచ్చే నిధులను సైతం రైతులకు అందించకుండా సొంతానికి వాడుకుంటున్నది.
కేంద్రం ప్రకటించిన కరువు మండలాలు, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులు ( రూ. కోట్లల్లో)
సంవత్సరం కరువు మండలాలు నష్టం కేంద్ర సహాయం ఫైనాన్స్ కమిషన్ సహాయం 2014-15 362 4,500 618.49 260
2015-16 231 3,506 791 274
2016-17 313 2,800 నివేదిక పంపలేదు 288
2017-18 232 2,200 నివేదిక పంపలేదు 302
2018-19 280 1,800 నివేదిక పంపలేదు 318
2019-20 383 4,500 నివేదిక పంపలేదు 333