ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. సోమవారం నాడు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు అయన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఎంపీని ఆస్పత్రికి తరలించే సమయంలో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుబ్బారెడ్డిని ఆయన్ను తరలించేందుకు వీలు లేదంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ఆపై కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా ఆంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఇద్దరు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి (73), వరప్రసాద్ రావు (64) లను ఇప్పటికే రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు దీక్ష కొనసాగిస్తున్నారు.