YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కళ తప్పిన రంజాన్

కళ తప్పిన రంజాన్

కళ తప్పిన రంజాన్
హైద్రాబాద్, మే 25
ముస్లింలకు అతిపెద్ద పండుగ రంజాన్. రంజాన్ మాసం వచ్చిందంటే ఉపవాసాలకు సమయం వచ్చినట్లే. నెల రోజుల పాటు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పచ్చి నీళ్లు సైతం ముట్టుకోకుండా కఠినంగా ఉపవాసాలు ఆచరించే ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత అన్నపానీయాలను సేవించి సేదతీరతారు. ఈ పండగ, రంజాన్ మాసం కోసం ప్రపంచంలో చాలా దేశాలలో ప్రత్యేక అనుమతులు, ఏర్పాట్లు కూడా ఉంటాయి.ఇక మన భాగ్యనగరం విషయానికి వస్తే ఇక్కడ రంజాన్ శోభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ నెల రోజుల పాటు నగరంలో రాత్రేదో పగలేదో అర్ధం కానంతగా భాగ్యనగరం మెరిసిపోతుంది. ఎక్కడ చూసిన విద్యుత్ దీపాలతో అలంకరించిన వీధులు, పూట పూట వినిపించే మత ప్రవచనాలు.. ప్రత్యేకించి ఈ మాసం కోసమే తయారుచేసిన అత్తరు వాసనలతో హైదరాబాద్ నగరం మురిసిపోతుంది.ఇక ఈ నెల రోజుల పాటు నగరంలో లభించే హలీం, బిర్యానీ, కబాబ్, నోరూరించే ఖీర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఇక ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసరాలలో ఈ సమయంలో ప్రత్యేకంగా దొరికే గాజులు, వస్తువులు, బట్టలకు కూడా విశేష ప్రాధాన్యం ఉంటుంది. హైదరాబాద్లో రంజాన్ అంటే ముస్లింలతో పాటు మిగతా మతాల వారికి కూడా పండగగానే ఉంటుంది.కానీ ఈఏడాది అవేమీ లేకుండానే రంజాన్ పూర్తవుతుంది. ప్రపంచాన్ని వణికించే మహమ్మారి కరోనా రంజాన్ సంబరాలపై నీళ్లు చెల్లేసింది. రంజాన్ వంటకాల కోసం ఆవురావురుమంటున్న ఫుడ్ లవర్స్ నోట్లో మట్టికొట్టేసిన కరోనా ఈ కాలంలో లభించే అత్తరు వాసన తగలక నాసికాలను మొద్దుబారేలా చేసింది. ప్రతి ఏడాది దగ్గరుండి జరిపించే ప్రభుత్వం కూడా చేసేదేం లేక జాగ్రత్తలతో ఎవరి ఇంట్లో వాళ్ళు పండగ చేసుకోవాలని తిరిగి ప్రజలనే కోరింది.అలా ఇప్పుడున్న వాళ్ళెవ్వరూ కూడా ఇప్పటి వరకు రంజాన్ పండగ ఇలా బోసిపోయిన సందర్భం చూడనేలేదు. అయితే భాగ్యనగరంగా పుట్టిన మన హైదరాబాద్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి గతంలో ఒకసారి తలెత్తిందని చరిత్ర చెప్తుంది. గతంలో 112 సంవత్సరాల క్రితం అంటే 1908లో సరిగ్గా రంజాన్ మాసంలోనే భారీ వర్షాలతో మూసీ నది ప్రళయ గర్జనతో నగరంపై విరుచుపడింది.దీంతో హైదరాబాద్ ప్రజలు ప్రాణాలను అరచేతిన పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. మూసీ వరదలకు ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీగా జరిగింది. ఆ వరదల నుండి కోలుకోలేనందుకు భాగ్యనగర ప్రజలకు ఎన్నో ఏళ్ళు పట్టింది. అయితే, వరదలు వచ్చిన ఆ ఏడాది రంజాన్ వేడుకలు జరగలేదు. మరుసటి ఏడాది నుండి స్థోమతను బట్టి మెల్లగా పరిస్థితులు చక్కబడ్డాయి.ఆ తర్వాత మూసీ నదిపై డ్యామ్ లు ఏర్పాటై ఇప్పటికి మళ్ళీ వరద ముప్పు రాలేదు. అయితే ఇన్నాళ్లుకు 112 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కరోనా మహమ్మారితో అదే పరిస్థితి దాపురించింది. నగరంలో ప్రజలను ఒకవైపు ఆర్ధిక కష్టాలు వెంటాడుతుంటే.. మరోవైపు కరోనా భయంతో పండగ సందడి లేకుండాపోయింది. చివరికి ఆలింగనం చేసుకొని చెప్పుకొనే ఆత్మీయ శుభాకాంక్షలు కూడా సామజిక దూరం పేరిట కరువైపోయాయి.

Related Posts