వామ్మో...మెట్ పల్లి మార్కెట్టా...
కరీంనగర్, మే 26, (న్యూస్ పల్స్)
చినుకు పడితే చాలు యార్డంతా చిత్తడిగా మారి కర్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి వ్యవసాయ మార్కెట్. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నిజామాబాద్ తర్వాత పసుపు అమ్మకంలో అతిపెద్ద మార్కెట్‌గా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతుంది. ఈమార్కెట్లో పసుపు, వరి, ధాన్యం, మక్కలు అమ్మకాలు సాగుతుంటాయి. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది రైతులు నమ్ముకున్న మార్కెట్ యార్డు అన్నదాతలకు ఆందోళనకు గురి చేస్తుంది.యార్డులో వివిధ అమ్మకాలపై ప్రభుత్వం అందించే లక్ష్యం కన్న అదనంగా ఆదాయాన్ని పెంచుతున్న మార్కెట్ అధికారులు రైతులకు కావల్సి సౌకర్యాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. సంవత్సరంలో కోటి ఆదాయాన్ని వివిధ రూపాల్లో వసూలు చేస్తున్న అధికారులు యార్డులో ప్లాట్‌ఫాంలకు మరమ్మతులు గాని నూతన నిర్మాణంగాని చేపట్టక పోవడం విశేషం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతులపై ప్రత్యేక దృష్టి సారించి యార్డులో రైతులకు కావల్సిన సౌకర్యాలు కల్పించి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది.యార్డులో ఏళ్ల కిందట వేసిన సీసీ ప్లాట్‌ఫారాలకు ఒక్క సారిగా మరమ్మతులు రావడంతో యార్డంతా ఎటు చూసినా గుంతలమయంగా మారింది. దీంతో చినుకు పడితే చాలు వర్షం నీరు బయటకు వెళ్లక గుంతలతో పాటు అమ్మకానికి ఉంచిన సరుకు చుట్టూ చేరి రైతులకు నష్టం వస్తోంది. వర్షం పడిన తర్వాత మూడు రోజుల వరకు నీరంతా గుంతలలో నిల్వ ఉండి కర్షకులను కోలుకోలేని పరిస్థితికి నెడుతోంది. ప్లాట్‌ఫాంలు ఎత్తుగా నిర్మించి రెండు పక్కల మురుగుకాల్వలు నిర్మించాలి.పసుపు అమ్మకాలలో నిజామాబాద్ తర్వాత అతిపెద్ద మార్కెగా పేరున్న మెట్‌పల్లి మార్కెట్లో మురుగుకాల్వలు లేక అవస్థలు ఎదురవుతున్నాయి. ఉన్న కాల్వల్లో మట్టి చెత్తాచెదారంతొ నిండి పోయినా వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు. కాల్వలు సరిగా ఉంటే వర్షం నీరంతా బయటకు వెళ్లి కొంత వరకైన నష్టాన్ని లేకుండా చేసేవి. ఏళ్ల తరబడి యార్డులో ఒక్క మురుగుకాల్వ కూడా నిర్మించక పోవడం విడ్డూరం. సీసీ ప్లాట్‌ఫాం ఎత్తుగా ఏర్పాటు చేసి రెండు వైపుల మురుగుకాల్వ నిర్మిస్తే ఒక్క చుక్కా నీరు కూడా నిలిచే పరిస్థితి లేదు. అధికారులు దృష్టి సారిస్తే అన్నదాతలకు అండగా నిలిచిన వారవుతారు.మార్కెట్ యార్డుకు చుట్టూ ప్రహరీతో పాటు మూడు వైపులా గేట్లు సరిగా లేక బయట నుంచి పశువులు, పందులు లోనికి వచ్చి ధాన్యం, మక్కలను తింటూ అన్నదాతలకు నష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి. పశువులు రాకుండా చూసే వారు లేక పోవడంతో రాత్రి పూట యార్డులోకి వచ్చి ఉదయం వరకు రైతులు అమ్మకానికి తెచ్చిన కుప్పల వద్దే ఉంటున్నాయి. రైతులే స్వయానా వాటిని బయటకు పంపించి సురుకును కాపాడుకునే పరిస్థితి మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్లో ఉంది.మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన రైతుల సౌకర్యం కోసం మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కేవలం పేరుకే మరుగుదొడ్లు ఉంటున్నాయి. అపరిశుభ్రతతో పాటు దుర్వాసనతో మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండడంతో అందులోకి వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. నీటి సౌకర్యం సరిగాలేక మూత్రశాలలను కడిగే వారు కరువయ్యారు. ఎప్పుడో ఒక్కసారి మూత్రశాలలను శుభ్రం చేస్తున్నారు.