పోలీసు స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య
పెద్దపల్లి మే 26
పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూమ్ లో తెల్లవారుజామున ఉరివేసుకొని వన్యప్రాణుల వేటగాడు శీలం రంగయ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామ శివారులో ఈనెల 24 వన్యప్రాణుల వేట కోసం వెళ్లిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన శీలం రంగయ్య తోపాటు మంథని మండలానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. వీరిని గత నాలుగు రోజులుగా పోలీస్ స్టేషన్ లో ఉంచుకోగా నిందుతుడు రంగయ్య మనస్థాపానికి గురై పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూమ్ కు వెలుతున్నానని చెప్పి వెళ్ళగా బాత్రూమ్ లో నుండి ఎంతసేపటికి రాకపోయేసరికి పోలీస్ సిబ్బంది వెళ్ళి చూడగా బాత్రూమ్ లో తనతో పాటు తెచ్చుకున్న చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు రంగయ్య ను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. సంఘటన స్థలానికి జిల్లా పోలీసు యంత్రాంగం తో పాటు రామగుండం సిపి సత్యనారాయణ చేరుకొని కేసు వివరాలు పరిశీలించారు. ఈ ఘటనపై వేరే జిల్లాకు చెందిన ఏసీపీ ని కేసు దర్యాప్తు కు నియమిస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల సంఘం మార్గదర్శక సూత్రాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని రామగుండం సి పి సత్యనారాయణ తెలిపారు.