YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కేంద్ర పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలి అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశాలు

కేంద్ర పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలి అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించి సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆయా శాఖల కార్యదర్శులను, శాఖాధిపతులను ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆయన  కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణ తీరుని సమీక్షించారు. సమావేశం ప్రారంభంలో 2017-18 సంవత్సరంలో కేంద్ర నిధులను అధికంగా వినియోగించి లక్ష్యాలను పూర్తి చేసిన శాఖలను ఆయన అభినందించారు. సమయం వృధా చేయకుండా లక్ష్యాలపై దృష్టిపెట్టి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రత్యేక శ్రద్ధవహించి మొదటి త్రైమాసికంలో ఫలితాలు సాధించాలన్నారు.  ప్రతి పథకం పనితీరుని ఆయన సమీక్షించారు. 81 కేంద్ర ప్రభుత్వ పథకాలకు మార్చి 31 వరకు వినియోగించిన నిధులను శాఖల వారీగా ఆర్టీజీ సీఈఓ బాబు.ఏ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2016-17 సంవత్సరంలో వినియోగించిన, ఇతర రాష్ట్రాలలో వినియోగించిన నిధులతో పోల్చి ఏ ఏ శాఖలు అధికంగా నిధులు వినియోగించాయో, ఏఏ శాఖలు తక్కువగా వినియోగించాయో ఆయన సవివరంగా తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మంజూరైన నిధులు, వాటి వినియోగం, వినియోగ సర్టిఫికెట్ల(యుసీలు) సమర్పణ తదితర అంశాలను స్క్రీన్ పై చూపుతూ ఆయన వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ,  పంచాయతీరాజ్, గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యశాఖ, మహిళా, శిశు సంక్షేమం, స్మార్ట్ సిటీస్, స్వచ్ఛభారత్, మెప్మా,  నైపుణ్య శిక్షణ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, గిరిజనులు, మైనార్టీలకు సంబంధించిన పథకాలు, స్కూల్ ఎడ్యుకేషన్, పీఎం కిసాన్ సంపద యోజన, ఓడిఎఫ్ (బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతం), నేషనల్ ఆయుష్ మిషన్, స్వాస్థ్య బీమా, వాటర్ షెడ్ నిర్వహణ, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన,  తదితర పథకాలను సమీక్షించారు. జనాభా ప్రాతిపధికన కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, నిధుల వినియోగం, శాఖల మధ్య సమన్వయం మొదలైన అంశాల గురించి చర్చించారు. 

               ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సాంఘీక సంక్షేమ శాఖ  ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య,  పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, రియల్ టైమ్ గవర్నెన్స్ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సొలోమన్ అరోకియా రాజ్, మహిళా,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ త్రాగునీరు, పారిశ్యుద్ధ్య విభాగం కార్యదర్శి బి. రామాంజనేయులు, పురావస్తు శాఖ, మ్యూజియంల కమిషనర్ డాక్టర్ జీ.వాణిమోహన్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Related Posts