ముమ్మరంగా వరి సేకరణ
నిజామాబాద్, మే 27,
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి సాగు భారీగా ఉంటుంది. గడిచిన యాసంగిలోనూ భారీగా పంటలు సాగు చేయడంతో గ్రామ గ్రామాన సిరుల పంట కురుస్తున్నది. ధాన్యాగారమైన ఉభయ జిల్లాలు రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు వహించడం ద్వారా ప్రక్రియ అంతా సులువుగా సాగింది. ఓ వైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలోనూ రాష్ట్రంలో జోరుగా పంట కొనుగోళ్లు జరిగాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రైతుల చెంతకే వెళ్లి ధాన్యాన్ని సేకరించారు. ఏటా కొనుగోలు కేంద్రాల వద్ద జరిగే చిన్నపాటి ఆందోళనలు కూడా ఈసారి ఎక్కడా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. బీహార్ వలస కూలీల కొరత కనిపించినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలతో స్థానిక యువతను ధాన్యం సేకరణకు వాడుకున్నారు. వెనువెంటనే ధాన్యాన్ని తూకం వేయడం, తరలించడం వంటివి చకచకా పూర్తి చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. భౌతిక దూరం పాటించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్కులు ధరిస్తేనే కొనుగోళ్లు జరిగేలా నిబంధన పెట్టి ప్రశాంతంగా ధాన్యాన్ని సేకరించారు. ఇంతటి కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ చూపిన చొరవ, శ్రద్ధాసక్తులతో రైతు లోకమంతా జేజేలు పలుకుతున్నది.20వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం సేకరణలో ఆయా జిల్లాల పరిస్థితిని గమనిస్తే నిజామాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 4.64లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 93వేల 545 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం ద్వారా ఆరో స్థానంలో నిలిచింది. మూడు లక్షల 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 98శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 317 కేంద్రాలను ప్రారంభించారు. 25 ఐకేపీ కేంద్రాల్లో 22,196 మెట్రిక్ టన్నులు, 292 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 72వేల 130 మంది రైతుల నుంచి రూ.546 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఇప్పటికే సేకరించగా.. 92 శాతం మేర చెల్లింపులు పూర్తయ్యాయి.ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కే అవకాశం ఉన్నప్పటికీ రైతులను గతంలో దళారులు మాయ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వ్యాపారులు, ఇతర మధ్యవర్తులు రైతుల పేరిట ధాన్యాన్ని విక్రయించకుండా ఉండేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానం చేసి రైతు ఖాతాల్లోనే చెల్లింపులు జరిగేలా చూస్తున్నారు. కేవలం 48 గంటల్లోనే రైతులు విక్రయించిన పంటకు మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నది. గరిష్ఠంగా నాలుగైదు రోజుల్లోపే నగదు రైతుకు చేతికి అందుతుండడం విశేషం.కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపునకు చేరింది. 98శాతం మేర పంట ఉత్పత్తులను సకాలంలో సేకరించాం. కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి ఆదేశాల మేరకు వేగవంతంగా ప్రక్రియను చేపట్టాం. రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకున్నాం. కొద్ది రోజుల్లోనే 100శాతం సేకరణ కూడా పూర్తవుతుంది. 3.05లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు