అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యుతాండవం.. లక్ష దాటిన మృతుల సంఖ్య
న్యూయార్క్ మే 27
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యుతాండవం చేస్తున్నది. మహమ్మారి కారణంగా ఆ దేశంలో మంగళవారంనాటికి మృతుల సంఖ్య లక్ష దాటింది. ప్రపంచవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది మరణిస్తే, దాంట్లో 28 శాతానికి పైగా మరణాలు అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. కరోనా వల్ల అమెరికాలో ఫిబ్రవరి 29న తొలి మరణం సంభవించింది. దాదాపు మూడు నెలల వ్యవధిలో మరణాల సంఖ్య 1,00,103కు చేరడం ఆందోళన కలిగిస్తున్నది. అంటే రోజుకు సగటున 1,111 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ నగరంలో అత్యధికంగా 29,310 మరణాలు చోటుచేసుకున్నాయి. కాగా అమెరికాలో ఇప్పటివరకూ 17,14,327 మందికి కరోనా సోకింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3,49,800 మంది మరణించగా, 56,42,404 మందికి వైరస్ సోకింది.