కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా..
నెల రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా బలగాల మోహరింపు
ముళ్లతీగలు చుట్టిన కట్టెలతో దాడి చైనా కడుపుమంట..పావుగా మారిన నేపాల్
ధీటుగా సిద్ధమవుతున్న భారత్
న్యూ ఢిల్లీ మే 27
ఆక్రమణవాదం.. రాజ్యకాంక్ష.. భారత్‌పై అసూయతో రగిలిపోతున్న చైనా.. ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నది. నెల రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా బలగాలను మోహరిస్తూ.. భారత సైనికులపై దాడులు చేస్తున్నది. లఢక్ సమీపంలోని సైనిక స్థావరాన్ని నెలరోజుల్లోనే విస్తరించి.. నాలుగు ఫైటర్‌జెట్లను మోహరించింది. ఈ నేపథ్యంలో భారత్ సైతం సై అంటూ స్పందిస్తున్నది. పరిస్థితిని ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని ఆదేశించారు. మనదేశం చైనాతో 3,488 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నది. దీనిని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) అని పిలుస్తున్నారు. ఇది లఢక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతుంది. 1962 భారత్-చైనా యుద్ధం తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. మొదట్లో ఈ ప్రతిపాదనను ఒప్పుకొన్న చైనా.. ఇప్పుడు అడ్డం తిరుగుతున్నది. ఎల్‌ఏసీ 2000 కిలోమీటర్లకు మించదని చెప్తున్నది. ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్నది. లఢక్, సిక్కింలోని పలు ప్రాంతాలు కూడా తమకు చెందినవేనని వితండవాదన చేస్తున్నది. తరుచూ చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడటం, కొన్ని ప్రాంతాలు తమవేనంటూ మ్యాపులు విడుదల చేయడం వంటి చర్యలకు దిగుతున్నది. భారత్ సమర్థంగా తిప్పికొడుతుండటంతో తోకముడుస్తున్నది. ముళ్లతీగలు చుట్టిన కట్టెలతో దాడి లడాఖ్ సరిహద్దులోని ఎల్‌ఏసీ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ వద్ద ఇటీవల చైనా బలగాలు దుర్మార్గంగా వ్యవహరించాయి. భారత బలగాలపై రాళ్లు విసరడమే కాకుండా ముళ్లతీగలు చుట్టిన కట్టెలతో దాడికి దిగినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. భారత బలగాలు కూడా ధీటుగా సమాధానమిచ్చాయన్నారు. ఎయిర్‌బేస్ విస్తరణ లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దు అయిన పాంగ్యాంగ్ సరస్సుకు 200 కిలోమీటర్ల దూరంలోని ‘గరి గున్సా’ ఎయిర్‌బేస్‌ను అత్యంత వేగంగా విస్తరించింది. నెలరోజుల్లోనే విస్తీర్ణం దాదాపు రెట్టింపయ్యింది. పైగా నాలుగు యుద్ధవిమానాలను మోహరించింది. ఇది జే-11 లేదా జే-16 ఫైటర్ జెట్‌గా అనుమానిస్తున్నారు. గతంలో ఒక్క యుద్ధ విమానం మాత్రమే ఉండేది. పావుగా మారిన నేపాల్ చైనా మరోవైపు నేపాల్‌ను భారత్‌పై ఎగదోస్తున్నది. గత ఏడాది అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్‌లో పర్యటించారు. అప్పటి నుంచి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ స్వరం మారింది. కాలాపానీ ప్రాంతం తమదే అంటూ మ్యాప్‌లు సిద్ధం చేసింది. మానస సరోవర యాత్ర కోసం లిపులేఖ్ కనుమ గుండా భారత్ నిర్మించిన రోడ్డుపై అభ్యంతరం తెలుపుతున్నారు. చైనా కడుపుమంట దలైలామాకు ఆశ్రయం ఇవ్వడం, టిబెట్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడం వంటి కారణాల వల్ల చైనా దశాబ్దాలుగా భారత్‌పై రగిలిపోతున్నది. అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ను ఇరికించేందుకు యత్నిస్తున్నది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యవహారశైలి ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు’ ఉంటున్నది. భారత్‌లో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి.. స్వదేశానికి వెళ్లగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్నీ అడ్డుకుంటున్నారు. ఈ కడుపుమంటకు అనేక కారణాలున్నాయి. 2017లో సిక్కింలోని డోక్లాం వద్ద సరిహద్దు వివాదం తలెత్తినప్పుడు భారత్ చైనాను తీవ్రంగా అడ్డగించింది. 73 రోజులపాటు జరిగిన ఈ వివాదంలో చైనా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. అనేక అంతర్జాతీయ కంపెనీలు చైనాను వీడేందుకు సిద్ధమయ్యాయి. మానవ వనరులు అధికంగా ఉన్న భారత్ వైపు చూస్తున్నాయి. భారత సరిహద్దు వెంట చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు చేపట్టింది. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం ప్సాంగ్-గల్వాన్ లోయ మధ్య 255 కిలోమీటర్ల మేర రోడ్డు, గాల్వన్ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన వైమానికతలం ‘అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్'ను నిర్మించింది. ఇది చైనాకు కంటగింపుగా మారింది. తాజాగా చైనా సైన్యం గాల్వన్ లోయలో వందకుపైగా తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకుంది. బంకర్ల నిర్మాణానికి, భారత్‌వైపు రోడ్డు నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చుకుంటున్నది. దీనికితోడు వివాదాస్పదంగా ఉన్న పాంగ్యాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో సరిహద్దు వెంట ఐదువేలకుపైగా అదనపు బలగాలను మోహరించింది.తాజా వివాదం నేపథ్యమిదీ..వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులు గస్తీ కాస్తుండగా చైనా సైనికులు పదే పదే అడ్డుకోవడం, దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దీంతో ఇరు దేశాల మధ్య గొడవ ప్రారంభమైంది. మే 5: తూర్పు లఢక్‌లోని పాంగ్యాంగ్ వద్ద భారత్, చైనాకు చెందిన 250 మంది సైనికులు కొట్టుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. ఇరువైపులకు చెందిన 100 మంది గాయపడ్డారు. మే 6: డేమ్చోక్, గల్వాన్ లోయల్లోనూ బాహాబాహీ.
మే 9: సిక్కింలోని నాథులా పాస్ వద్ద ఇరు దేశాలకు చెందిన 150 మంది సైనికులు కొట్టుకున్నారు.మే 12: లఢఖ్‌లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొట్టిన చైనా సైనిక హెలికాప్టర్లు. అప్రమత్తమైన భారత సైన్యం.. ‘సుఖోయ్-30 ఏంకేఐ’ యుద్ధవిమానాలను ఉపయోగించి తిప్పికొట్టింది. వెనుకకు తగ్గొద్దు: కేంద్రం తాజా వివాదం నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని రావత్ వివరించారు. అనంతరం ప్రధాని కార్యాలయంలో ప్రధాని అధ్యక్షతన జాతీయ భద్రతా సలహాదారు ధోవల్, సీడీఎస్, త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ నిర్మాణాలు ఆపాలని చైనా డిమాండ్ చేస్తున్నదని, ఈ అంశంపై సమావేశంలో చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్నిసార్లు తాము కోరినా చైనా వినలేదని.. కాబట్టి రోడ్ల నిర్మాణంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని కేంద్రం సైనికాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ధీటుగా సిద్ధమవుతున్న భారత్ చైనా సైన్యం సరిహద్దువద్ద గుడారాలు ఏర్పాటు చేయడం, గస్తీ కాస్తున్న భారత సైనికులను దూషించడం, దాడులు చేయడం వంటి కవ్వింపు చర్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వద్దకు బలగాలను తరలించింది. 81, 114 బ్రిగేడ్స్, ఐటీబీపీకి చెందిన 2500-5000 మంది భారత సైనికులు సరిహద్దుకు చేరుకున్నట్టు అంచనా. దీనికితోడు ఏ క్షణాన్నైనా సరిహద్దుకు చేరుకునేలా లఢక్‌లోని ఆర్మీబేస్‌ను సిద్ధం చేసింది. గాల్వన్ వద్ద నిర్మించిన వైమానికతలం ‘అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్'లో సీ-130జే యుద్ధవిమానాలను మోహరిస్తున్నది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొనేందుకు సైన్యాధిపతి నరవాణె 2రోజులు లఢక్‌లో పర్యటించారు. తాజా వివాదం నేపథ్యంలో చైనా సరిహద్దు మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని భారత్ నిర్ణయించింది.