YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

45 ఏళ్ల తర్వాత మిడతల దాడి

45 ఏళ్ల తర్వాత మిడతల దాడి

45 ఏళ్ల తర్వాత మిడతల దాడి
భోపాల్, మే 28,
దేశంలో రైతు ఆరుగాలం శ్రమించి, రాత్రి.. పగలు తేడాలేకుండా పండించిన పంటకు వంద చిక్కులు అడ్డంకిగా మారుతున్నాయి. భూమిలో విత్తనం వేసిన దగ్గర నుండి ఇప్పుడు ఏదైనా ఖర్చుతో కూడుకున్న పనే. రైతు చుట్టూనే కోట్ల వ్యాపారం జరుగుతున్నా ఆ రైతుకు మాత్రం పండిన పంట అమ్ముకొనే వరకు ఋణం ఎంతో ఆ దేవుడికి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. అన్నీ కలిసొచ్చి పంట అమ్మినా వందకు తొంబై శాతం రైతులకు మిగిలేది నష్టాలే. ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటామని దశాబ్దాలుగా చెప్తున్నా.. మరొకొన్ని దశాబ్దాలుగా ఇదే మాట చెప్తూనే ఉంటారని కూడా దేశంలో ప్రజలకు తెలిసిందే. అదీ మన దేశంలో వ్యవసాయం పరిస్థితి. అసలే అరకొర దిగుబడులతో నెట్టుకొస్తున్న మన దేశ రైతుల పాలిట కరోనా మహమ్మారి లాక్ డౌన్ శాపంగా మారి సంక్షోభంలో పడితే ఇప్పుడు ఇది చాలదన్నట్లుగా మిడతల దండు ఒకటి గుదిబండగా మారుతుందని ఆందోళనను వినిపిస్తున్నాయి.ఈ మిడతల దండు గురించి.. అవి సృష్టించే అరాచకాల గురించి.. ఒక్కసారి వాటి భారిన పడితే పంట పొలం నామరూపాల్లేకుండా పోతుందని.. చాలా ఏళ్ళుగా వింటున్నాం. గతంలో రాజస్తాన్‌, గుజరాత్‌, పంజాబ్, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల్లో ఈ మిడతల దండు ప్రవేశించినట్లు తెలుస్తున్నా.. 1974 అనంతరం వీటి దాడి గురించి పెద్దగా ఎక్కడా వినిపించలేదు.అయితే, గత ఏడాది మన శత్రుదేశమైన పాకిస్థాన్ నుండి రాజస్థాన్ లోకి అడుగుపెట్టినట్లుగా అప్పుడే దుమారం రేగింది. ఇక ఈ ఏడాది ఈ దండు అంతటితో ఆగకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోకి కూడా ప్రవేశించాయి. మహారాష్ట్రతో సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ, అక్కడ నుండి ఆంధ్రా భూభాగంలోకి కూడా ఈ ఏడాది ప్రవేశించే అవకాశం ఉందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ మిడతల దండు ఒక్క రోజులో 35 వేల మందికి సరిపోయే ఆహార ధాన్యాలను స్వాహా చేస్తోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎఒ) వెల్లడించింది. ఇప్పటికే పాకిస్తాన్‌, తూర్పు ఆఫ్రికాల నుండి వచ్చిన మిడతల దండుతో సుమారు లక్ష ఎకరాలలోని కాటన్‌, వేసవిలో వేసే ధాన్యాలు, కూరగాయలను నాశనం చేస్తున్నాయని వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ త్రిలోచన్‌ మొహాపాత్ర తెలిపారు.ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో 700 ట్రాక్టర్లు, 75 ఫైర్‌ ఇంజన్‌లు , మరో 50 వాహనాలతో మందులు స్ప్రే చేస్తున్నామని, డ్రోన్‌లను కూడా వినియోగిస్తున్నట్లు త్రిలోచన్‌ చెప్పారు. ముఖ్యంగా రాజస్తాన్‌లో వీటి ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఒక్క మందుల స్ప్రే చేయడంతో పాటు వీటిని ఎదుర్కొనేందుకు మరేదైనా మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు.కాగా, ఇప్పటికే ఈ మిడతలు ఆవహించిన రాష్ట్రాలలో రైతులు వీటిని చూస్తేనే వణికిపోతున్నారు. ఇవి పంటలను నాశనం చేయడంతో పాటు ఇవి వస్తున్నాయంటే ముందుగానే వచ్చే శబ్దం రైతుల గుండెలు ఆగేలా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికమైన పెట్టుబడులకు తోడు వీటిని ఎదుర్కొనేందుకు మందులు, ఇతర వస్తువుల కొనుగోలు కూడా తమకి భారమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారుఈ మిడతల దండు దాడి వెనుక కారణాలను కూడా కొందరు పర్యావరణ వేత్తలు నిశితంగా దర్యాప్తులు మొదలుపెడుతున్నారు. గతంలో 1974కి ముందే ఈ మిడతలు పంటల మీద దాడి చేసిన గుర్తులున్నా తరువాత పెద్దగా ప్రభావం చూపలేదని.. అయితే ప్రస్తుతం రేడియేషన్ ప్రభావంతో వాటిని ఆహారంగా తీసుకొనే కొన్ని పక్షులు కనుమరుగవడంతో మళ్ళీ వాటి విజృంభణ కొనసాగుతుందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా రైతు మాత్రం వీటి మూలంగా భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితి నెలకొంది.

Related Posts