2022 తర్వాత ప్రపంచ కప్
ముంబై, మే 28,
ఇది క్రికెట్ ప్రేమికులకు షాకింగ్, షేకింగ్ న్యూసే. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వరల్డ్ టీ20 2022కి వాయిదా పడినట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్-నవంబర్‌లో జరిగే అవకాశాలు కనుమరుగు కావడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలో ఈ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు .అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. దీంతో ఈ సమావేశం తర్వాతనే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం 2022లోనే టీ20 జరిగే అవకాశాలున్నాయి. ఈసమాచారం ప్రకారం అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచకప్ నిర్వహణకు ఆసీస్ కరోనా నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. సెప్టెంబర్ లో తమ దేశానికి వచ్చేవారి పర్యాటక వీసాలను ఆస్ట్రేలియా రద్దు చేయడం, సెప్టెంబర్ వరకు ఆసీస్‌లో లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో టోర్నీ ఏర్పాట్లు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మాజీ ఆటగాళ్లు సైతం ప్రపంచకప్ కంటే ఐపీఎల్ టోర్నీనే ఉత్తమమని భావిస్తుండడంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై మరికొద్ది గంటల్లో నిర్ణయం వెలువడనుంది.