టాలీవుడ్ పై జగన్ గుస్సా
విజయవాడ, మే 28
జగన్ ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతలు తీసుకుంటారు. ఇక వివిధ శాఖలను తన మంత్రులకు కేటాయించి వారి నుంచి మంచి పనితీరు రాబడతారు. ఆ శాఖలో వారు సరిగ్గా పనిచేయకుంటే మాత్రం మందలిస్తారు. తప్పు దిద్దుకోమని చెబుతారు. కానీ జగన్ తాను దగ్గర పెట్టుకున్న కీలకమైన శాఖ విషయంలో తన పనితీరును ఒకసారి అయినా బేరీజు వేసుకున్నారా? అన్నదే ఇక్కడ సందేహం. జగన్ దగ్గర ఉన్న శాఖలలో సినిమాటోగ్రఫీ శాఖ ఇపుడు ప్రధానమైనది. ఎంతటి ప్రధానం అంటే తొలిసారి ఈ శాఖను సహాయమంత్రి హోదాలో చేపట్టిన చంద్రబాబు నాటి తెలుగు సినీ సీమ అగ్రనటుడు ఎన్టీఆర్ అల్లుడు కావడానికి చకచకా నిచ్చెనలు వేసుకున్నారు.అతి కీలకమైనది ఈ శాఖ అంటే సినిమా వారితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వారు ప్రజాజీవితంలో రెండో వైపు ఉంటారు. అంటే రియల్ లైఫ్ లో రాజకీయ నాయకులు హీరోలు అయితే రీల్ లైఫ్ లో వారు హీరోలు. వారు కూడా ప్రజలకు విశేషంగా ప్రభావితం చేస్తారు. అటువంటి కీలకమైన శాఖను తన దగ్గరే ఉంచుకున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పటిదాకా ఏపీ వైపు టాలీవుడ్ చూపును మరల్చలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవితో భేటీలు వేసినా సినీ పరిశ్రమలో కదలిక లేదు. ఎన్నో వరాలు ఇస్తున్నా కూడా కిమ్మనడంలేదు.జగన్ సర్కార్ తాజాగా ఏపీలో సినిమా వారు షూటింగులు ఉచితంగా చేసుకోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసినట్లుగా సమాచారం వచ్చింది. అయితే టాలీవుడ్ మాత్రం తెలంగాణా వైపు చూస్తోంది. ఈ సమాచారం ఇలా రావడంతోనే తెలంగాణా మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో సినీ ప్రముఖులు భేటీ వేసి తమకు షూటింగులు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. అదే విధంగా ముఖ్యామంత్రి కేసీయార్ని కలసి కూడా చర్చలు జరిపారు. ఇంతచేసినా ఇండోర్ షూటింగులకే కేసీఆర్ అనుమతులు ఇచ్చారు. అవుట్ డోర్ షూటింగులు ఇప్పుడే కాదని అంటున్నారు. ఇది జరిగినా కూడా ఏపీ వైపు టాలీవుడ్ పెద్దలు చూడకపోవడం పైన చర్చ సాగుతోంది.నిజానికి జగన్ మొదటి నుంచి టాలీవుడ్ విషయంలో చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. అయితే ఇపుడు టాలీవుడ్ వైఖరి పట్ల వైసీపీ సర్కార్ పెద్దల్లో కూడా చర్చ సాగుతోంది. ఇలాగే వదిలేస్తె ఏపీ నుంచి సినిమా కలెక్షన్లు తీసుకెళ్తారు, తెలంగాణాలో తమ పన్నులు కడుతూ అక్కడ బలోపేతం చేస్తారు అన్న వాదన కూడా వైసీపీలో ఉందట. అందువల్ల ఇక మీద ఏపీలో సినిమా ధియేటర్ల టికెట్లను ఆన్ లైన్ చేయడం, ఇక్కడ సినిమాల మీద గట్టిగా పట్టు బిగించి కచ్చితంగా నిబంధలను అమలు చేయడం వంటివి చేయాలని ఆలోచిస్తున్నారుట.ఈ రకంగా చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావడమే కాకుండా, ఫేక్ కలెక్షన్లు ఆగుతాయని, అసలు లెక్కలు తేలుతాయని చెబుతున్నారు. అలాగే ఏపీ పట్ల టాలీవుడ్ చూపుపడుతుందని అంటున్నారు. ఈ విధానాన్ని ఏపీ సర్కార్ అమలు చేస్తే మాత్రం టాలీవుడ్ కు ముకుతాడు పడి ఇటువైపు కచ్చితంగా చూస్తుందని చెబుతున్నారు. దానికి కారణం ఏపీలోనే ఎక్కువ సినిమా హాళ్ళు ఉన్నాయి. కలెక్షన్లు కూడా ఇక్కడే వస్తాయి. మొత్తానికి జగన్ తన శాఖను చక్కదిద్ది అయినా టాలీవుడ్ చూపు ఇటు వైపు చూసేలా చేస్తారా, చూడాలి.