దళితులు, మహిళలు, మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా అన్నరు. అన్ని వర్గాలకు సమాన హక్కులు తమ పార్టీయే కల్పిస్తుందని అన్నారు. కేసీఆర్ దళిత, గిరిజనుల ద్రోహి అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దళిత, గిరిజనులపై దాడులకు నిరసనగా సోమవారం హైదరాబాద్ గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో కుంతియాతో పాటు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ అకారణంగా, ఎలాంటి తప్పు చూపకుండా సంపత్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో మొదటిసారి జరిగిందని అన్నారు. ఈ విధంగా సీఎం అన్ని విషయాల్లో.. దళిత వ్యతిరేకిగా, దళిత ద్రోహిగా గిరిజనులకు అన్ని విషయాల్లో మోసం చేస్తున్న విషయం తెలంగాణ దళిత సమాజం గుర్తించాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గిరిజనులకు12 శాతం రిజర్వేషన్‌పై తొలి సంతకం చేస్తానని కేసీఆర్ వాగ్ధానం చేశారని, నాలుగేళ్లు అయినా ఇంతవరకు అమలు చేయలేదని ఉత్తమ్ విమర్శించారు. మోదీ, కేసీఆర్ పరిపాలనలో దళితులు, గిరిజనులు అభద్రతకు గురౌతున్నారని ఆయన అన్నారు.