ఇంటర్ క్లాసులెప్పుడు
హైద్రాబాద్, మే 28
రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభించేదెప్పు డు? అనే దానిపై ఇంటర్ బోర్డు నిపుణులతో కమిటీని నియమించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓఎస్‌డీ సుశీల్‌కుమార్, పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్, జాయింట్ సెక్రెటరీ ఉపేందర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ బి శేషుకుమారి, పాఠశాల విద్యా శాఖ మాజీ అదనపు సంచాలకులు గోపాల్‌రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు వంటి అంశాలను పరిణనలోకి తీసుకుని ఇంటర్ విద్య ఎలా ఉండాలనే దానిపై ఈ కమిటీ పరిశీలించి ఈనెల 30లోగా నివేదిక సమర్పి స్తుంది. కరోనా నేపథ్యంలో బోధన, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, హాస్టళ్ల నిర్వహణ, ఆఫ్‌లైన్/ ఆన్‌లైన్ తరగతులు ఎలా నిర్వహించాలనే దానిపై పలు సూచనలు చేసే అవకాశమున్నది. లాక్‌డౌన్ అమలును బట్టి నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయిస్తామని వివరించారు. ఇంకోవైపు సబ్జెక్టుల వారీగా కమిటీలు వేశామన్నారు. ఆయా సబ్జెక్టుల్లో తీసుకోవాల్సిన మార్పులపైనా ఆ కమిటీలు పరిశీ లించి ఈనెలాఖరులోగా నివేదిక సమర్పిస్తాయని చెప్పారు. పదో తరగతి పూర్తయి ఫలితాలు విడుదల చేయడానికి జులై వరకు పట్టే అవకాశముందన్నారు. ఈలోగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులు జాగ్రత్తలు పాటించే విధంగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు.