మరో పుల్వామా దాడికి ప్లాన్..తిప్పికొట్టిన సైన్యం !
న్యూ ఢిల్లీ మే 28
పుల్వామా ఉగ్రదాడి ఉదంతం అందరికి గుర్తుండే ఉంటుంది. 2019 లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పొట్టనపెట్టుకున్నారు. మరోసారి అదే విదంగా మరో కారు బాంబుకి ప్లాన్ చేసారు. అయితే మన సైన్యం అప్రమత్తంగా ఉండటంతో ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టారు. తాజాగా ఉగ్రవాదులు పుల్వామా తరహాలో దాడికి పన్నిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో లష్కరే తొయిబా జైషే మొహమూద్ ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్టు ముందస్తు సమాచారం అందడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. పుల్వామాలో కారుకు అమర్చిన పేలుడు పదార్ధాలను గుర్తించి సైనికులు నిర్వీర్యం చేశారు. ముందస్తు సమాచారంతో ఉగ్ర కుట్రను సీఆర్పీఎఫ్ సైనిక బలగాలు భగ్నం చేశాయి. సైనిక వాహనాలు తనిఖీ కేంద్రం వద్ద కారులో ఐఈడీని భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో కారుపై భద్రతా బలగాలు కాల్పులు జరపగా.. ముష్కరుడు దానిని వదలి పరారయ్యాడు. అనంతరం కారులో పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేశారు. జేకే 08బీ 1426 నకిలీ నెంబరు హుండయ్ శాంత్రో కారులో వచ్చిన ముష్కరుడు చెక్పోస్ట్ వద్ద బారికేడ్లను తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించాడు.. అప్పటికే అప్రమత్తమైన సైన్యం అతడిపై కాల్పులు జరపడంతో వాహనం వదిలి పరారయ్యాడని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అందులో మొత్తం 20 కిలోలకుపైగా పేలుడు పదార్థాలున్నట్టు తెలిపారు. ముందస్తు సమాచారం అందడంతో సైన్యానికి మరో పెను ముప్పు తప్పింది దీనితో మరో పుల్వామా దాడి జరగకుండా భదతా బలగాలు అడ్డుకున్నాయి అని చెప్పవచ్చు.