బాలయ్య వర్సెస్ టాలీవుడ్
హైద్రాబాద్, మే 28,
సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. లాక్ డౌన్ వల్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై బాలకృష్ణ మాట్లాడుతూ.. షూటింగ్ తదితర అంశాలపై ప్రభుత్వంతో సినిమా పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలయ్య. కాగా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు పలు దఫాలుగా చర్చలు జరిపి సీఎం కేసీఆర్‌ను కలిసి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలవబోతున్నారు మెగాస్టార్. ఈ తరుణంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతుండగా.. వీటిపై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్.ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ని కలిసిన వారిలో అన్ని ఆర్గనైజేషన్స్‌కి సంబంధించిన వాళ్లు ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యుసర్ కౌన్సిల్ ఇలా చాలా మంది ఉన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి వాళ్లు వీళ్లు అని కాకుండా ఎవరికి ఉన్న పలుకుపడి వాళ్లు ఉపయోగిస్తున్నారు. మేం అక్కడకు వెళ్లడం వల్ల ఎవరూ కిరీటాలు పెట్టడం లేదు. మేం పని జరగడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సీఎం కేసీఆర్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో హైదరాబాద్ అనేది అదిపెద్ద సినిమా హబ్ దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు.అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారితో చిరంజీవి గారు మాట్లాడటం జరిగింది. సినిమా అనేది మాకు తల్లి లాంటిది అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇద్దరు తండ్రులు లాంటివారు. అందువల్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు ముఖ్యమే. అందువల్ల జగన్ గారిని కలుద్దాం అని అనుకున్నప్పుడు ఆయన విజయవాడలో ఉండటం.. లాక్ డౌన్ నిబంధనలు ఉండటం వల్ల లాక్ డౌన్ ముగిసిన తరువాత కలుద్దాం అని చెప్పారు. అంతేతప్ప ఎవర్నో వదిలేసి ఏదో చేస్తున్నట్టు కాదు.ఇండస్ట్రీకి మేలు చేయడానికి ముందుకు వచ్చే ఏ వ్యక్తి వెనుక అయినా మేం వెళ్లడానికి రెడీగా ఉన్నాం. నిర్మాతలు అందరూ ఒక్కటే.. ఇక్కడ గ్రూపుల్లేవ్.. ఏం లేవ్. ఊరికే పిచ్చి పిచ్చిగా అనవసరమైన మాటలు వద్దు. నిన్నటి వరకూ దాసరి నారాయణ రావుగారు ఇండస్ట్రీకి మేలు చేయాలని భుజాన వేసుకునే వారు. ఆయన వెనుకు మేం వెళ్లే వాళ్లం. ఈరోజు ఎవరైనా వచ్చి భుజాన వేసుకోవచ్చు. చిరంజీవి గారిని మేం అడిగాం. సార్.. మీ ఫేస్ వాల్యూ పనికి వస్తుందని మేం అడిగాం. ఆయన ముందుకు వచ్చారు. అలాగే నాగార్జున గారు వచ్చారు.. బాలయ్యగారు మీకు అవసరం అయితే చెప్పండి నేనూ వస్తా అన్నారు. మాకు అవసరం అనుకుంటూ వాళ్లను తీసుకుని వెళ్లడానికి మేం రెడీ. ఎవరితో పని జరుగుద్ది అనుకుంటే వాళ్ల వెనుక వెళ్తాం. ఎందుకంటే మొన్నటి వరకూ ప్రభుత్వాలు వేరు.. ఇప్పుడున్న ప్రభుత్వాలు వేరు. మాకు పని జరగడం ముఖ్యం.. షూటింగ్‌లు ప్రారంభం కావడం ముఖ్యం. మేం ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. మేం సినిమా వాళ్లం.నిజానికి బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు.. ఇప్పుడు కూడా మాట్లాడారు. నన్ను పిలవలేదు అనడానికి ఇది ఆర్టిస్ట్‌ల మీటింగ్ కాదు.. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు అంటే ఆయన సినిమా షూటింగ్ ఆగిపోయింది కాబట్టి వచ్చి అడిగి లీడ్ చేశారు తప్పితే మరోటి కాదు. ఇది చిన్న నాన్ సింక్‌లో ఉంది. బాలకృష్ణ గారు వస్తానంటే ఎవరైనా కాదంటారా? అంతే తప్పితే వీళ్లను పిలవాలి.. వీళ్లను పిలవ కూడదు అనేం లేదు. బాలకృష్ణ గారు మా హీరో. ఆయనకు ఇక్కడ జరిగింది మొత్తం చెప్పాను. మిమ్మల్ని పిలిచారా? అని ప్రెస్ అడగడం వల్ల.. నన్ను పిలవలేదు, పేపర్‌లలో చూసి తెలుసుకుంటున్నా అని అన్నారు తప్పితే.. ఇది ఆర్టిస్ట్‌లను పిలిచే మీటింగ్ కాదు. అవసరం అనుకుంటే తప్పకుండా పిలుస్తాం.
బాలయ్య ఆర్టిస్ట్ మాత్రమేనా?? ఇండస్ట్రీ పెద్దగా చూడటం లేదా?? అసలు ఇక్కడ ఈ ప్రశ్నే రాంగ్.. బాలయ్య ఆర్టిస్ట్ మాత్రమేనా?? ఇండస్ట్రీ పెద్దగా చూడటం లేదా?? అంటే.. చాలా విషయాల్లో మేం బాలకృష్ణ గారిని ముందు పెట్టి వెళ్లాం. కాని ఇక్కడ సమస్య షూటింగ్‌లకు సంబంధించి అది నిర్మాతలు చేయాల్సిన పని. ఆర్టిస్ట్‌లు తరువాత వస్తారు. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు లీడ్ చేసేవారు. ఆయన చిన్న మాట చెబితే పని అయిపోయేది. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. అంతేతప్ప మాలో విభేదాలు అనేవి లేవు. ఇండస్ట్రీలో ఏమీ తెలియని వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు టీవీ కనిపిస్తే ఏదోటి మాట్లాడాలి. వాళ్లకు పనీ పాటా ఉండదు.. సినిమాలు తీసేది ఉండదు. వాళ్ల వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఏది ఏమైనా అందర్నీ కలుపుకునే ముందుకు వెళ్లబోతున్నాం’ అని అన్నారు సి కళ్యాణ్.