భారత్, చైనా మధ్య పెను సమస్య: డోనాల్డ్ ట్రంప్
న్యూ ఢిల్లీ మే 29
భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. భారత్, చైనా మధ్య పెను సమస్య ఏర్పడిందని, దీని గురించి ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్‌లోని ఓవెల్ ఆఫీసులో ఆయన ఈ అంశంపై జర్నలిస్టులతో మాట్లాడారు. భారత్, చైనా మధ్య తీవ్ర అగాధం ఏర్పడిన విషయం మీకు తెలిసిందే అన్నారు. భారతీయులను తనను ఇష్టపడుతారని, మా దేశ మీడియా కన్నా భారతప్రజలే నన్ను ఎక్కువ ఇష్టపడుతారని, మోదీని నేను లైక్ చేస్తానని, ఆయన్ను ఎంతో అభిమానిస్తాను అని, ఆయనో గొప్ప వ్యక్తి అంటూ మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్, చైనా మధ్య ఇటీవల సరిహద్దు విషయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. లడాఖ్, సిక్కిం ప్రాంతాల్లో రెండు దేశాలు సైన్యాలను మోహరించాయి. ఈ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. భారత, చైనాల మధ్య పెద్ద సమస్య వచ్చిందని, రెండు దేశాల్లోనూ 140 కోట్ల జనాభా ఉన్నదని, రెండు దేశాల సైన్యం కూడా బలమైందని, చైనా తీరు పట్ల ఇండియా సంతోషంగా లేదని, అలాగే భారత తీరు పట్ల చైనా కూడా అసంతృప్తితో ఉండి ఉంటుందని ట్రంప్ అన్నారు. ఈ అంశం గురించి ప్రధాని మోదీతో మాట్లాడానని, చైనాతో ఏర్పడ్డ ప్రతిష్టంభన పట్ల మోదీ అసంతృప్తితో ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఒకవేళ రెండు దేశాలు అంగీకరిస్తే, తాను ఆ సమస్య పట్ల మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు.