ఇండియా ముందు భారీ సవాళ్లు
తైవాన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థలో పరిశీలక హోదా దక్కేనా!
న్యూ ఢిల్లీ మే 29
ప్రస్తుతం భారత్ ముందు అతిపెద్ద సవాల్ ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా భారత ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఒకవిధంగా ఇది ఇండియాకు అరుదైన గౌరవంగా చెప్పాలి. అంతేకాదు ఇప్పుడు ఇండియా ముందు భారీ సవాళ్లు నిలిచాయి. వైరస్ ను కట్టడి చేయడంలో తైవాన్ అనుసరించిన వ్యూహం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. మహమ్మారి ఆనవాళ్లు కనిపించినప్పటి నుంచి తైవాన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. చైనాలో వైరస్ ఉదృతంగా ఉన్న సమయంలో కూడా తైవాన్ లో కేసుల రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ తైవాన్ విషయం ఇప్పుడు ఇండియాపై ఒత్తిడి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. తైవాన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థలో పరిశీలక హోదా ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది. దీనికి తైవాన్ కు దౌత్యపరంగా మిత్రదేశాలుగా ఉన్న 14 దేశాలు మద్దతు పలికాయి.అయితే ఎలాగైనా పరిశీలక హోదాను అడ్డుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తున్నది. తైవాన్ కు పరిశీలక హోదా ఇస్తే చైనా అధిపత్యానికి దెబ్బకొట్టినట్టు అవుతుంది. తైవాన్ తన ఆధీనంలో ఉందని చైనా ఇప్పటికి చెప్తున్నది. చైనా అధీనంలో ఉండేందుకు తైవాన్ ఏ మాత్రం ఇష్టం లేదు. స్వతంత్ర దేశంగానే ఉండాలని చూస్తుంది. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక సంఘ అధ్యక్ష హోదాలో ఇండియా తీసుకునే నిర్ణయం కీలకం కానున్నది. ఈ విషయంలో ఎవరిని నొప్పించకుండా ఇండియా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.