కరోనా సాకుతో తల్లిని గెంటేసిన కొడుకు
కరీంనగర్, మే 29,
కరీంనగర్ జిల్లాలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి సాకుతో కన్న తల్లిని వదిలించుకోవాలని కొడుకులు ప్రయత్నించారు. వయసు పైబడిన ఆ పెద్దావిడను కనికరం లేకుండా కాదు పొమ్మన్నారు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎర్రటి ఎండలో నిలబెట్టి పైశాచికత్వాన్ని చాటారు. తల్లిని బయటికి పంపడం పట్ల ఇరుపొరుగు ప్రశ్నించినా, తిట్టినా, చివరికీ చీదరించుకున్నా ఆ కొడుకులు వినలేదు. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో కొంత కాలం క్రితం ఓ వృద్ధురాలు షోలాపూర్ వెళ్లింది. తిరిగి కొడుకుల ఇంటికి వచ్చింది. అయితే, తల్లికి కరోనా సోకిందని కొడుకులు ఆమెను కనీసం ఇంట్లోకి రానివ్వలేదు. బయటే ఉండిపోవాలని తేల్చి చెప్పేశారు. కొడుకులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో చేసేది లేక తల్లి శ్యామల ఎర్రటి ఎండలో రోడ్డు పైనే కూర్చుండిపోయింది. స్థానిక కార్పొరేటర్ అశోక్ ఈ విషయం తెలుసుకొని, అక్కడికి చేరుకొని కొడుకులను మందలించారు. దీంతో పెద్ద కొడుకు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు.