ఐదు శాఖలపై పూర్తిగా నిఘా
విజయవాడ, మే 30
పార్టీ ఏదైనా నాయకుల మనస్తత్వం మాత్రం ఒక్కటే. ముందు పదవులు, తర్వాత అధికారం.. ఆ వెంటనే సంపాదన. ఈ మూడు లేకపోతే.. అసలు నాయకుడే కాదనే రేంజ్‌లో నేటి తరం నాయకులు భావిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ దీనికి అతీతులు కారు. కాకపోతే.. `అవకాశమే` చిక్కాలి! పార్టీ అధి నేత తమను ఫ్రీగా వదిలేయాలి. అంతే. గత ప్రభుత్వాన్ని చూస్తే.. అధినేత చూసీ చూడనట్టు వ్యవహరించారు. దీంతో నాయకులు అవకాశం వెతుక్కుని మరీ చెలరేగిపోయారు. అందిన కాడికి వెనుకేసుకున్నారు. ఫలితంగా అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా పాకింది. దీంతో అధికారమే కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అవినీతిని… నేతలను కంట్రోల్ చేసిన చంద్రబాబు చివరి రెండేళ్లలో పూర్తిగా చేతులు ఎత్తేసిన ఫలితమే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది.ఈ పరిస్థితి ఆపార్టీ ఈపార్టీ అనేదేముంది.. అన్ని పార్టీల్లోనూ అవకాశం వస్తే.. జరిగేదే.. నిప్పులమని చెప్పు కొనే కమ్యూనిస్టు పార్టీల్లోనే అవకాశం వస్తే.. చెదలు పట్టించుకున్న నేతలను మనం ఎంతో మందిని చూశాం. ఈ విషయాలను గమనించో ఏమో.. వైసీపీ అధినేత, సీఎం జగన్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాను అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే చేసిన తొలి పలుకుల్లో కీలకమైంది.. అవినీతి రహితం. తన పాలనలో పైసా కూడా అవినీతి జరగకూడదని ఆయన చెబుతున్నారు. ఏ కార్యక్రమం, ఏ పథకం చేపట్టినా.. అవినీతి రహితంగా ఉండాలని సూచిస్తున్నారు.అయినప్పటికీ.. కొందరు నాయకులు అనివార్య పరిస్థితులు కావొచ్చు.. వ్యూహాలు కావొచ్చు.. దారి తప్పే పరిస్థితి ఉందని గమనించిన జగన్.. పురపాలక శాఖ, హోం శాఖ, ఎక్సైజ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, గనుల శాఖ వంటి కీలక శాఖలపై నిఘాను మెయింటెన్ చేస్తున్నారని వైసీపీలో చర్చ సాగుతోంది. ఆదిలో ఆయా శాఖల మంత్రులను జగన్ ఫ్రీగానే వదిలేశారు. అయితే, కొన్నాళ్లకు ఆయా శాఖలపై కొన్ని ఫిర్యాదులు నేరుగా జగన్‌కే అందాయని తెలిసింది. మహిళా మణులు నిర్హించే శాఖల్లో వారి పతులు చక్రం తిప్పుతున్నారని, ఈ క్రమంలో చేతులు తడుపు కొంటున్నారని కూడా జగన్‌కు సమాచారం అందింది.గుంటూరు జిల్లాకే చెందిన ఓ మంత్రి విషయంలో ఇలా జరిగే సరికి.. జగన్ సదరు మినిస్టర్‌గారికి క్లాస్ ఇచ్చారనే ప్రచారం తాజాగా వెలుగు చూసింది. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చేతులు తడపాలని ఒత్తిళ్లు పెరగడంతో జగన్ జోక్యం చేసుకున్నారు. అదేవిధంగా మిగిలిన శాఖల్లోనూ ఇదే తరహా ఫిర్యాదులు అందాయి. దీంతో జగన్ వారికి క్లాస్ ఇస్తూనే.. తనదైన శైలిలో వ్యవహరించారు. తనకు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని తెచ్చి.. ఆయా శాఖలకు పీఆర్వోలుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించారట.దీంతో సదరు మంత్రులు ఇప్పుడు అడుగు ఎటు తీసి ఎటు వేయాలన్నా కూడా హడలి పోతున్నారని, వారు ఏం చేసినా క్షణాల్లోనే జగన్‌కు సమాచారం వెళ్తోందని వైసీపీలో చర్చ సాగుతుండడం గమనార్హం. కొందరు మంత్రుల శాఖలకు సంబంధించి సమీక్షలు కూడా నేరుగా సీఎం చేసే పరిస్థితి ఉందంటున్నారు. ఉత్తరాంధ్రలో ఒక మంత్రి దూకుడుకు పూర్తిగా బ్రేకులు పడిపోయాయంటున్నారు. ఎవరైనా శాఖల పరంగా అవినీతికి పాల్పడినట్టు లేదా తోక జాడినట్టు జగన్‌కు నివేదికలు వెళ్లిన వెంటనే ఆ శాఖలపై నిఘా ఎక్కువైపోతోందట.