YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

చెట్లపైనే నిమ్మకాయలు

చెట్లపైనే నిమ్మకాయలు

చెట్లపైనే నిమ్మకాయలు
గుంటూరు, మే 30,
నిమ్మ రైతులపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఉదయం పూట అవకాశం కల్పించినా లాక్‌డౌన్‌ వల్ల పంటకు డిమాండ్‌ తగ్గింది. ఎండాకాలం వచ్చినా నిమ్మకు డిమాండ్‌ తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంలో రెండు రోజుల్లోనే విక్రయించుకునే వీలు కల్పించడంతో పంటను అమ్ముకోలేక పోతున్నామని వాపోతున్నారు.తెనాలి మార్కెట్‌లో పది రోజుల క్రితం కేజీ రూ.15లు పలికిన నిమ్మ, గురువారం రూ.27 నుంచి రూ.30లు పలికింది. దీంతో నిమ్మతోటలు అధికంగా ఉన్న మండల పరిధిలోని చిలువూరు గ్రామ పరిసర గ్రామాల రైతులు కోతలకు సిద్ధమయ్యారు. నిమ్మకాయలను మార్కెట్‌కు సోమవారం తెమ్మని మార్కెట్‌ వర్గాలు తెలపడంతో నిమ్మను తరలించేందుకు సిద్ధమవుతున్నారు. నిమ్మను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినప్పటికీ అక్కడ డిమాండ్‌ లేకపోవడంతో మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గాయి. వారం రోజుల క్రితం రూ.లక్ష60వేలు కిరాయి చెల్లించి నిమ్మకాయల లోడుతో లారీని కలకత్తాకు పంపించారు. ఈ లోడును నాలుగు రోజుల వరకు సరుకు దించలేదు. రెగ్యులర్‌గా ఎగుమతి చేసే తెనాలి వ్యాపారస్తుల విజ్ఞప్తి మేరకు సరుకు దించారు. రోజుకు 10 బస్తాల కన్నా అమ్మలేకపోతున్నామని కలకత్తా వ్యాపారస్తులు చరవాణి ద్వారా తెలిపారు. దీంతో నిమ్మకు ఉన్న డిమాండ్‌ పరిస్థితి ఏంటో పరిస్థితి అర్థమవుతోంది.  స్థానికంగా ఉన్న డిమాండ్‌ మేరకు ధర కొంతమేర పెరిగినా దేశవ్యాప్తంగా డిమాండ్‌ లేకపోవడంతో ఎగుమతులు లేవు. మరో నెలరోజులుమాత్రమే నిమ్మ రైతులకు అవకాశం ఉంది. మే నెల పోతే జూన్‌లో వర్షాలు ప్రారంభ మవుతాయి. అప్పుడు నిమ్మ కొనేవారే ఉండరు. అష్టకష్టాలు పడి మార్కెట్‌కు పంటను తీసుకెళితే వ్యాపారస్తులు తిరస్కరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. .స్థానికంగా పసుపు రంగులో ఉండే పండు కాయలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఎగుమతి ఉంటేనే ఆకుపచ్చరంగులో ఉండే పచ్చకాయలు రవాణాకు అనుకూలం. సకాలంలో కోతలు లేక పండిన కాయలు రాలిపోతున్నాయి. ఈ ఏడాది తోటలు తెగుళ్ల బారిన పడి కాపు తగ్గింది. ఉన్న పంటకు డిమాండ్‌ లేదు. పూర్తిగా నష్టాల్లో మునిగిపోయామని రైతులు వాపోతున్నారు.

Related Posts