అపార ప్రకృతి సంపదకు, ప్రపంచంలోనే శ్రేష్ఠమైన కలపకు నెలవైన అడవులు మాయమయ్యాయి. కాకులు దూరని కారడవులు కనిపించకుండా పోయాయి. ఆకాశాన్నంటే మహావృక్షాలతో అలరారిన ప్రకృతి సంపద తరలిపోయింది. వందల కిలోమీటర్లు విస్తరించి ఉండాల్సిన అడవులు నానాటికీ కుంచించుకుపోయాయి. . ఒకవైపు చెట్లను నరకడం, మరోవైపు భూములను కబ్జా చేయడంతో లక్షల ఎకరాల అడవులు కనుమరుగయ్యాయి. ఆర్‌ఓఎఫ్ ఆర్ పట్టాల ముసుగులో వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. రిజర్వ్ ఫారెస్ట్ భూములు చాలాచోట్ల కబ్జాల పాలుకాగా కీకర భీకర అభయారణ్యాలు కూడా మైదానాలుగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్రహతిహతంగా కొనసాగిన విధ్వంసం వల్ల ఇవాళ తెలంగాణ అడవులను పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం మూడు అటవీ రేంజ్‌లలో కలిపి మొత్తం 49,716.87 హెక్టార్ల అడవి ఉంది. నూజివీడు రేంజ్‌లో 12,708.8 హెక్టార్లు, మైలవరం పరిధిలో 11,619.67 హె., విజయవాడ రేంజిలో 25,388.4 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. విస్తీర్ణం బాగానే ఉన్నా.. ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. 10వేల హెక్టార్లు పైగా అన్యాక్రాంతమయ్యాయి. మొత్తం విస్తీర్ణంలో ఇది 20 శాతం. జిల్లాలో మొత్తం 33.3 శాతం సాధారణ అటవీ విస్తీర్ణంలో కేవలం 7.55 శాతంలోనే దట్టమైన అడవులున్నాయి. వీటిల్లోనూ చాలా వరకు పరాధీనమయ్యాయి. చెట్లను కొట్టేస్తూ పోతే పర్యావరణానికి తీవ్ర ముప్పు తప్పదు. వర్షపాతం బాగా పడిపోతుంది. జిల్లాలోని అటవీ విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. దీనివల్ల భూగర్భ నీటి మట్టం కూడా అడుగంటుతోంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సకాలంలో వానలు పడక వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు జంతువుల సంచారానికి ఇబ్బందిగా పరిణమించింది. అటవీ ప్రాంతం కుచించుకుపోతుండడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది.