YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అనవసర వివాదాలతో జగన్

అనవసర వివాదాలతో జగన్

అనవసర వివాదాలతో జగన్
విజయవాడ, మే 30
ఏపీలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులపై దేశవ్యాప్తంగా చర్చగా మారింది. కారణం.. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం నుండి న్యాయస్థానాల వరకు వ్యతిరేకించడం. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఒకటికి నాలుగు సార్లు చెప్పినా వినకపోవడంతో ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లలో కేంద్రం కీలకమార్పులు చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.ఒకటేమిటి.. రెండేమిటి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అరవైకి పైగా నిర్ణయాలను సంస్థలు, కేంద్రం, కోర్టులు వ్యతిరేకించాయంటే సహజంగా దేశం దృష్టి రాష్ట్రంపై పడుతుంది. ఇక తాజాగా పరిణామాలను చూస్తే.. ఏ రోజుకి ఆ రోజు రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తూనే ఉన్నాయి. డీజీపీ నుండి సిఎస్ వరకు అందరూ ధర్మాసనం ముందు బోనులో నిలబడాల్సి వచ్చింది.చివరికి శుక్రవారం హైకోర్టు ఇచ్చిన ఎన్నికల కమిషనర్ తీర్పులో ఆ గవర్నరును సైతం దోషిగా నిలబెట్టేసింది ఏపీ ప్రభుత్వం. రాజ్యాంగ సంస్థల నిబంధనలను ఉల్లఘించి ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం.. దానికి గవర్నర్ ఎలాంటి న్యాయసంప్రదింపులు చేయకుండా ఎలా సంతకం చేశారన్న దానిపై గవర్నర్ బీబీ హరిచందన్ సైతం ఇరుకున పడ్డారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వానికి తీవ్ర భంగపాటులే మిగిలినా జగన్ సర్కార్ మాత్రం ఇంకా అదే మొండిగా ఆలోచనలో ఉన్నట్లుగా కథనాలు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో తాజాగా హైకోర్టు తీర్పుపై సుప్రీమ్ కోర్టుకు వెళ్లాలని న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా రాజకీయవర్గాలలో అప్పుడే కథనాలు వస్తున్నాయి.కాగా ఇప్పటికే అధికార పార్టీ నేతలు.. మేము ప్రతిపక్ష పార్టీలతోనే కాదు.. న్యాయస్థానాలతో కూడా పోరాటం చేస్తున్నామని చెప్పిన మాటలు వింటే రాజకీయ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా న్యాయస్థానాలతో యుద్ధం చేయడం అంటే కొరివితో తల గోక్కున్నట్లేనని చెప్పుకోవాలి. తెలిసి తెలిసి రాజ్యాంగ వ్యవస్థలకు ఎదురెళ్ళడం సాహసం అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. నిజానికి జగన్ ప్రస్తుతం చేస్తున్నదంతా కొనితెచ్చుకున్న వివాదాలతో రాజకీయ యుద్ధమేనని చెప్పాలి. ముందుగా శాసనమండలి విషయానికి వస్తే.. మండలిలో బలం లేకుండా బిల్లు తీసుకెళ్లడం పొరపాటైతే.. దానికి మొండికిపోయి చివరికి మండలే రద్దు వరకు వెళ్లారు. కానీ ఇప్పటికీ ఆ విషయంలో ప్రభుత్వానికి ఒరిగింది ఏమి లేదు. పైగా మరో ఆరునెలలు పోతే అక్కడ కూడా ప్రభుత్వానికే మెజార్టీ. కనుక అది ప్రభుత్వానికే నష్టం. ఇక ఎన్నికల కమిషనర్ విషయాన్నే తీసుకుంటే ఈరోజు, రేపు లేదా ఎల్లుండి.. ఏదోకరోజు ఎన్నికలు జరిపి తీరాలి. కానీ, తన నిర్ణయాన్ని విమర్శించడం ఒక ఎత్తైతే.. కులాన్ని తెచ్చి.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని సామాన్య కర్తలతో కూడా తిట్టించడం కొనితెచ్చుకున్న వివాదమే. ఇంకా మొండిగా దొడ్డిదారిన తనను తొలగించి.. మాజీ న్యాయమూర్తిని ఆ పదవిలో కూర్చోబెట్టారు.ఇక్కడ కూడా ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని జగమెరిగిన సత్యమే. చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తయినా ప్రభుత్వం పట్టుదలతో చివరికి మాజీ న్యాయమూర్తిని సైతం విమర్శలపాలు చేశారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చేసింది కూడా అతే. పై అధికారితో ఆరోపణలు ఖండిస్తే పోయే దాన్ని రాజకీయం చేయాలనీ చూసి చివరికి పంతానికి పోయి అదే న్యాయస్థానం ముందు బొక్కబోర్లా పడ్డారు. ఎక్కడో రంగనాయకమ్మ రాష్ట్రంలో ఎవరికి తెలుసు. కానీ సీఐడీ రంగంలోకి తెచ్చి ఆవిడను రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును పట్టుకొని ఆ విషయాన్ని రాష్ట్రమంతా తెలిసేలా చేసింది ప్రభుత్వమే. ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి.. రంగనాయకమ్మ అసభ్యంగా పోస్టు పెట్టారని.. విశాఖ డాక్టర్ అసభ్యంగా తిట్టారని కేసులు పెట్టాలన్నారు. ఏకంగా మంత్రులు మీడియాకెక్కి తిడుతుంటే.. దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు అందుకుంటున్నారు. మరి దాని గురించి ఎన్ని కేసులు పెట్టాలి.ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయకూడదని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ వ్యక్తులకు కూడా తెలుసు. మరి ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకున్న ఐఏఎస్ అధికారులకు తెలియదా? పోనీ ఒకసారి హైకోర్టు రంగులను తీసేయాలని తీర్పునిచ్చినా.. మళ్ళీ ఇంకో రంగు కలిపి జీవో తేవడం దేనికి సంకేతం.. ఇది కొనితెచ్చుకున్న వివాదం కాదా? ఈ కేసులో చివరికి ప్రభుత్వం ప్రధానకార్యదర్శి మహిళా ఉన్నతాధికారి అయినా నీలం సహానీ కోర్టులో నిలబడాల్సి వచ్చింది.అసలు డాక్టర్ సుధాకర్ తో పోరాటం.. రంగనాయకమ్మతో పోరాటం.. రంగులు వేయాలని పోరాటం.. ఎన్నికల కమిషనర్ తో పోరాటం.. ఏంటి అసలు ఇదంతా. పోనీ పోరాడినా ఇటు ప్రభుత్వానికి కానీ.. అటు తన పార్టీకి కానీ ఏమైనా కలిసి వచ్చిందా? అదీ లేదు. పార్టీల వారీగా విడిపోయిన ప్రజలకు ఈ వివాదాలలో తప్పొప్పులు లెక్కించకపోవచ్చు. కానీ తటస్థ ఓటరు మాత్రం ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడు. ఆ ఓటరే రాజకీయ పార్టీల భవిష్యత్ ను మార్చేది.. నేతల తలరాతను రాసేది. జగన్ ప్రభుత్వం ఇకనైనా ఆ విషయాన్ని గమనించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
 

Related Posts