YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతులకు అకాల కష్టాలు

రైతులకు అకాల కష్టాలు

అకాల వర్షం అన్నదాతను నానా అవస్థల పాలు చేసింది. భారీ వర్షం ఎడతెరిపి లేకుండా సుమారు రెండు గంటలపాటు కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని చేలన్నీ ముంపునకు గురయ్యాయి. అకాల వర్షాలు రైతుల్ని ముంచేశాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానల వల్ల పలు జిల్లాల్లో బొప్పాయి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. పక్వానికొచ్చిన దశలో మామిడికాయలన్నీ నేలరాలాయి. కోతకొచ్చిన వరి... గాలివానకు మట్టిపాలైంది. కర్నూలు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. కోతకోసిన వరి ఓదెలు నీటిలో నానుతున్నాయి. గాలివానకు కళ్లాలు, పొలాల్లో తడిసిన ధాన్యాన్ని, వరి పంటను చూసి రైతులు కంట తడిపెట్టుకుంటున్నారు. వడగండ్ల వాన, ఈదురుగాలుల కారణంగా పొలంలోనే ధాన్యం రాలిపోయింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెట్ల నిండా కాయలతో ఉన్న బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. గెలలు కోతకొస్తున్న దశలో ఉన్న అరటి తోటలన్నీ పడిపోయాయి. ఉల్లి పంట కొట్టుకుపోగా, జొన్న, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాల ధాటికి 6,600 ఎకరాల్లో పండ్లతోటలు, 11,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న తదితర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.కోతలు పూర్తయిన చేలల్లో ఎక్కడి పనలు అక్కడే ఉండిపోగా వాటిని కాపాడుకునే అవకాశం లేక రైతులు చేలల్లోనే వదిలేశారు. ఇప్పటికే కోతదశకు చేరుకున్న చేలల్లో కురిసిన భారీ వర్షానికి కొన్ని చేలల్లో గింజ రాలిపోతోంది. కోతదశకు చేరుకున్న మరికొన్ని చేలల్లో వర్షం వల్ల ముంచెత్తిన ముంపునీటితో కోతలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. చేలల్లోనే ముంపునీటిలో నానుతున్న వరి పనలను కాపాడుకొనే ప్రయత్నాల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఇదే వర్షం మరోసారి కురిస్తే నష్ట తీవ్రత బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో వరిపంట సుమారు 7.90 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు చేస్తుండగా, పంట గింజ పోసుకుని 60 శాతం చేలు కోతదశకు చేరుకున్నాయి. కోనసీమ వ్యాప్తంగా సుమారు 300 ఎకరాల్లో వరిపంట దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేలల్లో ఉన్న వరి పనలు ముంపు నీళ్లలో నానుతున్నాయి. అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం గ్రామీణ మండలాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. కోసిన చేలల్లోనే నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని పలు చోట్లకూడా భారీ నుంచి ఓమోస్తారు వర్షం కురవగా ఈప్రాంతాల్లో ఇంకా కోతలు ప్రారంభం కాకపోవడం అన్నదాతలను గట్టెక్కించినట్లు అయింది. అక్కడక్కడా చేలు నేలకొరిగాయి. అల్లవరం మండలంలోని దేవగుప్తం, మొగళ్లమూరు, కొమరగిరిపట్నం, తుమ్మలపల్లి గ్రామాల్లో కోతలు చేపట్టిన చేలల్లో వరిపనల రూపంలో ఉండిపోగా వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Posts