తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. సరికొత్త ట్రెండ్‌కు శ్రీ కారం చుడుతున్నారు. సెక్రటేరియట్‌లో అడుగుపెట్టకుండా ప్రగతిభవన్ నుంచి పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టిస్తున్నారు. మంత్రులకు అపాయింట్‌మెంట్ దొరకదు. ఇప్పటివరకు ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ, ఎప్పుడూ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను నిత్యం తిట్టిపోసే ఇద్దరు ఎర్రన్నలకు మాత్రం అపాయింట్‌మెంట్ దొరికింది. ఇది అధికార టీఆర్ఎస్‌తోపాటు ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండు రోజుల క్రితం సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తమ పార్టీ సమావేశాలు ఉన్నాయనీ, సమావేశాలకు ప్రభుత్వ సహకారం అందించాలని సీఎం కోరినట్లు పైకి చెబుతున్నా.. అసలు ముచ్చట వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. హైదరాబాద్ లో పార్టీ అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నామని, కేరళ సిఎంతో పాటు పశ్చిమబెంగాల్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రులు,ఇతర జాతీయ నాయకులు కూడాపాల్గొంటున్నారని వివరించారు. ఈ సభలకు ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు కావాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రికి సిపిఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారుజాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగింది. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రకటించి, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ఇంకా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని సిఎం చెప్పారు. పరిష్కరించదగిన సమస్యలు కూడా అపరిష్కృతంగానే ఉండడం పాలకుల వైఫల్యమే అని సిఎం అన్నారు. ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన కాంగ్రెస్గతంలో ఎన్నడు కూడా ఇలా పార్టీ సమావేశాలకు సహకరించాలని సీఎంలను కోరిన సందర్భాలు లేవు.కొన్నినెలల కిందట సీపీఎం నేతృత్వంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు అయింది. ఇందులో సీపీఐ, సీపీఐఎంల్ న్యూడెమోక్రసీలు కలవలేదు. పలు ప్రజాసంఘాలు, పలు వామపక్షాలు ఫ్రంట్‌లో భాగస్వామ్యం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి బరిలోకి దిగుతామని తమ్మినేని చెబుతున్నారు. ఓవైపు అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, తెలంగాణ జన సమితి తదితర పార్టీలు ఏకమవుతుంటే సీపీఎం మాత్రం ఎవరినీ సంప్రదించకుండానే తనకుతానుగానే ఓ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని మందిలో కలవకుండా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే బీఎల్ఎఫ్ ఏర్పడినప్పటి నుంచే విమర్శలు వచ్చిపడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి అంతిమంగా అధికార టీఆర్ఎస్‌కే లాభం జరిగేలా సీపీఎం వ్యవహరిస్తోందనీ, ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో ఓ అవగాహనకు వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ సమావేశాల పేరుతో సీఎం కేసీఆర్‌తో తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌కు సీపీఎం లాంటి పార్టీల అవసరం ఎంతైనా ఉందనీ.. ఈ నేపథ్యంలోనే వారికి ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది.