ఏది చర్య ..ఏది ప్రతిచర్య..!?
బుద్ధుడిది ఖచ్చితంగా చెపుతాడు..నిశ్శబ్దంగా కూర్చోవటం నేర్చుకోమని.అంటే సోమరితనంగా వుండమని కాదు. ఆ నిశ్శబ్దం నుండి మొదలయ్యేదే “చర్య “ అంటాడు. మీకా నిశ్శబ్దం తెలీకపోతే... ఆ ప్రశాంతత, నిశ్చలత్వం తెలీకపోతే, మీరేమి చేసినా అది ప్రతిచర్యే అవుతుంది.ఎవరో మిమ్మల్ని అవమానిస్తారు. మీకు కోపమొస్తుంది!ఎవరో మిమ్మల్ని పొగుడు తారు. మీకు సంతోష మొస్తుంది! ఎవరో మిమ్మల్ని కించ పరుస్తారు మీరందుకు కుంగిపోతారు! అంటే ఎవరో స్విచ్ నొక్కుతారు. మీరందుకు స్పందిస్తారు!అంటే..ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు.బాధ పెట్టగలరు. మీలో ద్వేషాన్ని రగిలించగలరు. వారు కోరుకున్నట్టు మిమ్మల్ని పిచ్చివారిని కూడా చేయగలరన్న మాట. ఇతరుల కోరిక ననుసరించి మీరు స్పందిస్తూ వున్నారు. ఇతరుల ప్రభావం మీ ప్రవర్తన మీద వుందని దానికి అర్ధంఅప్పుడు మీ ప్రవర్తన మీ చర్య ఎలా అవుతుంది..? ప్రతిచర్య అవుతుంది గానీ!
బుద్ధుడు ఓ రోజు ఓ గ్రామం
మీదుగా వెళుతున్నాడు.బుద్ధుని తత్వంఅర్ధంకాని వారికి బుద్ధుడొక పనీ, పాట లేని సోమరిలా అనిపించాడు. పైగా తన బోధనలతో యువకులందరినీ చెడగొడుతున్నాడు కూడా.అది నచ్చని వారంతా పని కట్టుకుని దారికాసి, బుద్ధుడిని పట్టుకుని నానా తిట్లూ తిట్టారు.అన్ని తిట్ట్లూ ప్రశాంతంగా విని బుద్దుడిలా అన్నాడు.“మీరంతా ఇంతవరకు నాకోసం ఇంత సమయం వెచ్చించి నందుకు మీకు ధన్యవాదాలు! నేనిపుడు మరో గ్రామానికి వెళ్ళాలి. అక్కడ కూడా కొందరు నా కోసం మీలాగే ఎదురు చూస్తూ ఉంటారు. రేపు మళ్ళీ వచ్చి మీ తిట్లను వింటాను ఈ రోజుకు నన్ను వెళ్ళనివ్వండి “ అన్నాడు. ఆ మాటలకు గ్రామస్తులు నిర్ఘాంత పోయారు.....’ఏమిటీ మనిషీ!? అసలు మనిషేనా? రోషం లేదా?’ అదే అడిగేసారు..“సరే! అయితే ఈ ఒక్కటీ చెప్పు. నిన్ను మేమిన్ని మాటలన్నాం కదా! కనీసం ప్రతిగా ఒక్కమాటైన లేదా నీవద్ద..!?”అందుకు బుద్దుడు వారితో,“నిజమే! మీకు నా జవాబు కావాలంటే నా దగ్గరికి 10 సంవత్సరాల క్రితం వచ్చి ఉండాల్సింది.ఇప్పుడు ఇక్కడ ఆ మనిషి లేడు. ఈ పదేళ్ళ కాలంలో నాలో ‘ఇతరులవల్ల ప్రభావితం’ కావటమనే లక్షణం పోయింది.ఇప్పుడు నాపై నేను మాత్రమే అధికారిని. నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను. ఇతరుల ప్రభావం వల్లకాదు. నా అంతర్గత అవసరాలకు అనుగుణంగా మాత్రమే నేను నడుచుకొంటాను.మీరు నన్ను తిట్టాలను కున్నారు. తిట్టారు. అందుకు మీకు సంతృప్తి కలిగి ఉంటుంది. అయితే మీ మాటలతో నన్ను అవమానపరచాలన్న మీ కోరిక మాత్రం నెరవేర లేదు.ఎందుకంటే, మీరు నాకు ఇవ్వాలనుకున్న ఆ అవమానాన్ని నేను స్వీకరించలేదు. అలా స్వీకరించ నంతవరకు నాకు అది అర్ధరహితమైనదే. ఎదుటి వారి మాటలకు ఎవరైనా స్పందించి తిరిగి మాటలంటే వారా అవమా నాన్ని స్వీకరించి,అంగీకరించారని అర్ధం! ఎవరైతే ఎరుకతో లేరో వారే ఇలాంటి చర్యలకు ప్రతిస్పందిస్తారు.” అన్నాడు. ఆ మాటలకు ఆ గ్రామస్తులంతా అవాక్కయ్యారు. ప్రత్యుత్తర మివ్వటానికి వారివద్ద ఏ జవాబు మిగలలేదు..... బుద్ధునికి పాదాభివందనం చేయటం తప్ప! స్పృహలో లేని వ్యక్తే స్పందిస్తాడు.కానీ బుద్ధిజీవి గమనిస్తాడు......అతడి అంతర్గత శాంతినుండి నిశ్శబ్దంనుండీ! ఎరుక వల్లే బుద్దిజీవి చర్య పుడుతుంది. ఎరుక కలిగించేది ధ్యానమే!!!ఎరుక కలిగిన వారి చర్య వారి స్వాభావిక ప్రవర్తన వల్ల పుడుతుంది తప్ప ఇతరుల ప్రేరేపణ వల్ల కాదు.చర్య ..ప్రతిచర్యల మధ్య తేడా ఇదే!
శర్వాణి కెకె పరివార్