*బ్రాహ్మణులు అనగా ఎవరు ?*
బ్రాహ్మణుడు - బ్రహ్మణి స్థితః బ్రాహ్మణః.*
*" బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః "*! బ్రహ్మ జ్ఞానము కలవాడు బ్రాహ్మణుడు; బ్రహ్మ భావన యందు రమించువాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మీ ముహుర్తంలో లేచి, నిత్యానుష్ఠాన పరుడైనవాడు; దైవీ గుణ సంపద కలవాడు, సర్వభూతహితైషి బ్రాహ్మణుడు. సార్వజన హితం, సార్వజన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం.
బ్రాహ్మణ వంశములో జన్మించిన వాడు బ్రాహ్మణుడు ! బ్రాహ్మణులకు పుట్టక పోయినా, పుట్టీ , నిత్య నైమిత్తిక కర్మల నాచరించకపోయినా బ్రాహ్మణుడు కాడు.
శ్రీ మహాభారతం లో-
*"పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును*
*నిజము శూద్రు కంటె నీచతముడు*
*స తు శౌచధర్మశాలి శూద్రుండయ్యును*
*నతడు సద్ద్విజుండ యనిరి మునులు."*
శ్రీ మహాభారతం లోనే -
నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్ర సమము బ్రాహ్మణునకు ' అని చెప్పారు.
బ్రాహ్మణులు వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తారు. మద్యమాంసాలను ముట్టరు.
బృంహ్ - విస్తరణే - అనే ధాతువు నుండి బ్రహ్మ అనే పదము వచ్చింది. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము బ్రహ్మము. ఆ బ్రహ్మమునే అంతటా దర్శించేవాడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణులు వ్యక్తిగత సుఖాన్ని, స్వార్థాన్ని విడిచి పెట్టి, వైదికాచారాలను పాటిస్తూ, శాంతస్వభావులై, ఏకాంతప్రియులై, సత్యధర్మాచరణ చేస్తూ, దయాళువులై ఉంటారు.
*" బ్రాహ్మణస్య దేహోయం న సుఖాయ ప్రకల్పతే " !!*
బ్రాహ్మణుని శరీరము అతని సుఖం కోసం కాదు, లోక క్షేమం కోసం పరమాత్మ తో కల్పించబడింది. బ్రాహ్మణుడు తన సుఖం చూసుకోడు. సర్వ మానవాళి సంక్షేమం కోసం పాటు పడతాడు కనుక, మిగతావారందరూ బ్రాహ్మణుని సంక్షేమం కోరాలి.
బ్రాహ్మణ కులములో తాము వేదములోని ఏ శాఖకు సంబంధించిన వారో, ఆ వేదశాఖను శిక్షాది షడంగాలతో పూర్తిగా అధ్యయనము చెయ్యటము బ్రాహ్మణుల కర్తవ్యము. బ్రాహ్మణోచితమైన అధ్యయనము, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహాలనే షట్కర్మలను ఆచరించటం బ్రాహ్మణుల విధి.
*"యజనం యాజనం దానం*
*బ్రాహ్మణస్య ప్రతిగ్రహః !*
*అధ్యాపనం చాధ్యయనం*
*షట్కర్మాణి ద్విజోత్తమాః"!!*
అగ్ని ఆరాధన, యజ్ఞ నిర్వహణ బ్రాహ్మణుల కర్తవ్యములు. నాలుగు వేదాలను, వేదాంగాలను అధ్యయనం చెయ్యటం, శిష్యులకు బోధించటం బ్రాహ్మణుల పని. వీరు పాపరహితులై, శుద్ధ మనస్కులై ఉండాలి. వీరు ఇంద్రియాలను తమ వశములో ఉంచుకుని, ధర్మం తప్పకుండా జీవించాలి.
*"జన్మనా జాయతే శూద్రః*
*సంస్కారాత్ ద్విజ ఉచ్యతే!!"*
అంటారు కొందరు మహానుభావులు. కానీ ఇది శాస్త్ర సమ్మత నిర్వచనము కాదు అని పండితులు చెప్తున్నారు. అయినా ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు అంటే - మానవులందరూ ఒకటే అని చెప్తున్నాం కదా ! సమానత్వం లో అసమానత్వం ఎందుకొచ్చింది? అని అడిగే వారికి కొందరు ఇలా చెప్తున్నారు.
వారి భావన ప్రకారం
పుట్టుకతో మానవులందరూ శూద్రులే ! ఉపనయన సంస్కారం పొంది, ద్విజుడు అవుతున్నాడు అంటారు.
ద్విజుడు - అంటే రెండవసారి జన్మించిన వాడు. ఏ జీవిత గమ్యాన్ని చేరటానికి, ఏ లక్ష్యాన్ని సాధించటానికి ఈ మానవ జన్మ లభించిందో, దాన్ని సాధించటానికి కావలసిన సాధన చేసే అర్హతను సంపాదించేందుకు పొందే సంస్కారమే ఉపనయనము. ఈ ఉపనయన సంస్కారం తో ద్విజుడు అవుతున్నాడు.
జన్మనా జాయతే శూద్రః - అంటే - పుట్టిన ప్రతి బిడ్డ కి ముందు తెలిసేది ఆకలి. క్షుత్ అంటే ఆకలి. క్షుత్పిపాసలు - అంటాము. ఆకలి దప్పికలు. ఆకలి దప్పికల చేత ఇంద్రియ లోలత్వం తో లాగబడేవాళ్ళందరూ క్షుత్ ద్రులే - క్షుద్రులే ! ప్రతి మనిషి జీవిత ప్రారంభ దశలో క్షుద్రుడే ! ఈ పదమే కాలక్రమంలో శూద్రుడు గా మారింది.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఉపనయనాది
సంస్కారములు పొంది, సత్య నిరతిని, ధర్మ వర్తనను, సత్వగుణ సంపదను కలిగి ఉండి, గాయత్రి మంత్రోపదేశం పొంది, నిత్య నైమిత్తిక కర్మలనాచరిస్తూ అనుష్ఠాన పరుడయినవాడు బ్రాహ్మణుడు.
వైదిక సాహిత్యాన్నధ్యయనం చేసి, తత్సారాన్ని సామాన్యులకు బోధిస్తూ, వారిని అభ్యుదయ మార్గంలో నడిపిస్తారు బ్రాహ్మణులు.
బ్రాహ్మణులను ' ద్విజులు ' అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు పుట్టిన వాడు. తల్లి గర్భంలో పుట్టడం మొదటి జన్మ.
ఉపనయన సమయంలో గురువుగారు హస్త స్పర్శ తో వటువులోనికి శక్తి పాతం చేస్తారు. అది అతనికి రెండవ జన్మ. దానివల్ల ద్విజుడవుతున్నాడు.
ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు.
ద్వి జ - రెండు ''జ' లు కలవాడు. ఉపనయన సంస్కారం చేసినపుడు రెండవ జన్మ పొందినట్లే ! ఎందుకంటే, బ్రాహ్మణునకు ఉపనయనం జరిగేవరకూ ఎటువంటి వైదిక కర్మలు చెయ్యటానికి అర్హత ఉండదు. ఉపనయనం కాకపోతే తల్లిదండ్రులకు అంతిమ సంస్కారం కూడా చేయలేడు. యజ్ఞ యాగాది క్రతువులు, వివాహాది వ్యవహారములు ఏవి చెయ్యాలన్నా ఉపనయన సంస్కారం జరగాలి. అందుకే ఉపనయన సంస్కారం పునర్జన్మ వంటిది. పంచశిఖలను పెట్టి గాయత్రీ మంత్రోపదేశము ద్వారా సంస్కరించి చేసే ఈ కార్యక్రమాన్ని అందుకే 'ఉపనయన సంస్కారము" అని పిలుస్తారు.
ఉప- సమీపమునకు, నీ - నయ్ - తీసుకుని వెళ్ళటం; సమస్త యజ్ఞ కర్మలు చేసే అధికారాన్ని అనుగ్రహించే గురువు సమీపమునకు తీసుకువెళ్ళి, బ్రహ్మోపదేశం చేయించటం.
జన్మించడం ద్వారా ఒక "జ", జన్ - జా - పుట్టుట; జంధ్యాన్ని ధరించడం ద్వారా రెండవ 'జ' లు కల బ్రాహ్మణుడు ద్విజుడు.
విహిత శాస్త్రాధ్యయనం చేసి, శాస్త్ర జ్ఞానం వల్ల, శ్రుతులను- వేదములను అధ్యయనం చెయ్యటం వల్ల శ్రోత్రియుడవుతున్నాడు.
విశేషమైన ప్రజ్ఞ కలిగి, విప్రుడవుతున్నాడు. తన జ్ఞానముతో, జ్ఞాన బోధ తో అందరిలో జ్ఞాన ప్రేరణ, ధర్మ ప్రేరణ కలిగించి, విప్రుడయ్యాడు.
శృతి జ్ఞానం పెంపొందించుకుని, మహావాక్య సారాన్ని మననం చేసి బ్రహ్మ నిష్ఠని పొంది, బ్రహ్మ జ్ఞాని అయి బ్రాహ్మణుడవుతున్నాడు.
సత్ప్రవర్తన, సాధన, సత్సాంగత్యము, తపస్సులతో, బ్రహ్మ జ్ఞానం సంపాదించుకుని బ్రాహ్మణుడు పరమార్ధమును పొందుతున్నాడు. .
అందరూ బ్రాహ్మణులే అయినా, కొందరు ఆలయంలో దైవపూజాదికాలు నిర్వర్తిస్తారు. వీరిని ' అర్చకులు ' అంటారు. కొందరు అధ్యాపకులయి, విద్యాబోధ చేస్తారు. వీరిని ' ఆచార్యులు ' అంటారు. కొందరు యజ్ఞ యాగాది క్రతువులనుచేయిస్తారు. వీరిని - బ్రహ్మ అనీ, హోత అనీ, ఉద్గాత అనీ, అధ్వర్యుడనీ అంటారు. కొందరు శ్రాధ్ధాది కర్మలు చేయిస్తారు. అందరూ కలిసి సర్వ మానవాళి సంక్షేమ కోసం పాటుపడతారు.
మహర్షుల వలన, మునుల వలన ఏ వర్ణమునకు చెందిన స్త్రీ వలన జన్మించినా, వారు బ్రాహ్మణులుగానే గుర్తింపబడతారు. పరాశర మహర్షికి మత్స్య గంధి- యోజన గంధి కి జన్మించిన వేదవ్యాసమహర్షి సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువు అంశ ! యావద్ మానవ జాతికి, విశేషంగా హైందవులకు అనంత జ్ఞాన భాండాగారాన్ని అందించిన మహనీయుడు, విశ్వ గురువు శ్రీ వేదవ్యాసమహర్షి !
బ్రహ్మ మంత్రాలతో అభిమంత్రించిన హోమ హవిస్సుతో జన్మించాడు కనుక క్షత్రియుడుగా పుట్టినా, విశ్వామిత్రుడు దృఢ సంకల్పం తో తపస్సు ద్వారా ముని అయి, ఋషి అయి, మహర్షి అయి, బ్రహ్మర్షి అయ్యాడు. పరమోత్కృష్టమైన గాయత్రీ మంత్ర ద్రష్ట అయ్యాడు. దాసీ పుత్రుడు గా పుట్టిన బాలుడు సాధనతో, భక్తి తో, సత్సాంగత్యంతో జీవితము గడిపి, మరుజన్మ లో బ్రాహ్మణ దంపతులకు కుమారుడు గా జన్మించి, నారద మహర్షి అయి, దేవర్షి అయ్యాడు. విదురుడు జన్మాంతర సంస్కారం వలన బ్రహ్మజ్ఞానం పొందాడు. కనుక బ్రాహ్మణునిగా పరిగణింపబడ్డాడు. అయినా, విదురుడు తాను బ్రాహ్మీ తేజమే అయినా, శూద్రస్త్రీకి జన్మించినందు వలన, పరమ ధార్మికుడు అయినా, ధృతరాష్ట్రునికి అడుగడుగునా ధర్మబోధ చేసినా, బ్రహ్మ జ్ఞానము మటుకు తాను బోధించకుండా సనత్సుజాతుని చేత బోధింపజేశాడు.
ఋగ్వేదం లోని పురుషసూక్తం లో విరాట్పురుష వర్ణన ఉంది. అది చెప్పినది సాక్షాత్తుగా పరమాత్మ ! చెప్పించినది మహర్షుల చేత ! అందులో ఇలా ఉంది. - *" ...బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ! బాహూ రాజన్యః కృతః ! ఊరూ తదస్య యద్వైశ్యః !* *పద్భ్యాగుమ్ శూద్రో అజాయత ! ..."* అని, బ్రాహ్మణులు విరాట్పురుషునికి ముఖము వంటివారు అని చెప్పారు, లేక ముఖములోనుంచి వచ్చారు. ఆ విరాట్పురుషుని ముఖమే బ్రాహ్మణులు - అన్నారు. ఎందుకు ? వాక్కు, తెలివి, ఆలోచన ముఖం లో ఉంటాయి కనక ! బ్రాహ్మణులు సమాజ హితం కోరి, అందరికీ మంచి చెప్తారు కనుక. సత్వగుణ సంపన్నులై , శమదమాది షట్క సంపన్నులై , సత్య వాక్పాలకులయి, సదాచార సంపన్నులయి , సాత్వికాహారం స్వీకరిస్తూ, స్వాధ్యాయం చేస్తూ, జపతపహోమాదులను చేస్తూ తపోబలం కలిగి ఉంటాడు కనక,
ముఖం లోని నోటి తో అందరికీ మంచి, చెడు తెలియచెప్తారు . ఙ్ఞానబోధ చేసి తరింపచేస్తారు కనుక !
మన ఋషులు ఒకరెక్కువ, ఒకరు తక్కువ అని చెప్పలేదు. ఎవరెవరి శక్తి సామర్ధ్యాలను బట్టి వారివారికి ఆయా పనులను అప్పజెప్పారంతే !! ఒక కుటుంబం సవ్యంగా సాగాలంటే, నలుగురూ నాలుగు పనులూ చెయ్యాలి. ఒక ఆఫీసు సక్రమంగా నడవాలంటే భిన్న వ్యక్తులు భిన్న బాధ్యతలను నిర్వహించాలి. అలాగే సమాజం కూడా !
మనందరికీ అత్యంత ఆరాధ్య దైవమైన శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు.
*"దైవాధీనం జగత్సర్వం*
*మంత్రాధీనం తు దైవతమ్ !*
*తన్మంత్రో బ్రాహ్మణాధీనం*
*బ్రాహ్మణో మమ దేవతా" !!*
బ్రాహ్మణులు యజ్ఞ యాగాదులు చేసి, దేవతలకు హవిస్సులు సమర్పిస్తే, దేవతలు ఆనందించి, వర్షాలు కురిపిస్తారు. పంటలు పండుతాయి. లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే -
*" గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం*
*లోకాస్సమస్తాః సుఖినో భవంతు "* అన్నారు.
గోవులు, బ్రాహ్మణులు క్షేమం గా ఉంటే లోకాలు మొత్తం క్షేమంగా ఉంటాయి.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో