YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

భగవంతుని సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు" 

భగవంతుని సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు" 

 భగవంతుని సృష్టిలో పనికిరానిది అంటూ ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు" 
ప్రస్తుత విద్యావ్యవస్థలో మనం మార్పు తీసుకు రాగలిగితే యువత ఆత్మహత్యలు ఆగిపోతాయి. వైఫల్యాలు, నిరాశా నిస్పృహలు సమసిపోతాయి. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది.పూర్వం బ్రహ్మమిత్రుడు అనే గొప్ప గురువుండే వాడు. ఆయన దగ్గర పదిమంది శిష్యులు మాత్రమే ఉండేవారు. అంతకుమించి చేరనిచ్చేవాడు కాదు. ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపేవాడు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒకటే పరీక్ష పెట్టారు.  పదిమంది విద్యార్థులను పిలిచి ‘మీరు అరణ్యం లోకి వెళ్లి, అక్కడున్న అన్ని చెట్లకు ఉన్న అన్ని రకాల, జాతుల ఆకులనూ పరిశీలించండి. ఏ మందుకూ పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి’ అన్నాడు. విద్యార్థులకు ఆనందమైంది. ఎందుకంటే పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టంగానీ, పనికిరాని ఆకులు తేవడంలో కష్టమేముంది? వెంటనే బయలుదేరి వెళ్లారు. సరదాగా చెప్పుకోవాలంటే.. పనికిరాని ఆకులు తేవడానికి ఒక విద్యార్థి రెండు జేబులున్న వస్త్రం  ధరించి వెళ్లాడు. మరొక విద్యార్థి కాస్త పెద్ద సంచి తీసుకెళ్లాడు. మరో విద్యార్థి యూరియా సంచే పట్టుకెళితే, ఇంకొక విద్యార్థి ఏకంగా రెండెడ్ల బండే తీసుకెళ్లాడు. అప్పటికీ ఆ విద్యార్థిని గురువుగారు అడిగారు ‘రెండెడ్ల బండెందుకురా!’ అని. ‘పనికిరాని ఆకులు తెమ్మన్నారు కదా మీరే!’ అంటే, ‘సరే అవి పనికిరావో, నువ్వు పనికిరావో తర్వాత తేలుద్దాంలే, ముందు నువ్వు వెళ్లిరా!’ అన్నారు. ఇలా పదిమందీ వెళ్లారు. వెళ్లినవారిలో రెండెడ్ల బండి తీసుకెళ్లిన విద్యార్థే ముందు వచ్చాడు. మట్టి తవ్వి ట్రాక్టరులో వేసినట్లుగా గుత్తగా ఆకులన్నీ తీసి బండి నింపేసి తెచ్చాడు. ‘ఇవన్నీ పనికిరానివే’ అని చెప్పాడు గురువుగారితో. ఆయన నవ్వుకున్నారు. తరువాత సంచి తీసుకెళ్లిన విద్యార్థి, రెండు జేబుల వస్త్రం విద్యార్థి.. ఇలా తొమ్మిదిమందీ వచ్చారు. ఒక్కొక్కళ్లు వాళ్లకి తోచినన్ని పనికిరాని ఆకులు తెచ్చి గురువుగారికి చూపించారు. చివరికి పదవ విద్యార్థికూడా వచ్చాడు. అతని పేరు జీవకుడు. అతని ముఖం చిన్నబోయి ఉంది. గురువుగారు ‘ఏం నాయనా అలా ఉన్నావు! నువ్వేమీ తేలేదా ?’ అని అడిగారు. విద్యార్థి ‘గురువుగారూ నేను ఎంత వెతికినా వైద్యానికి పనికిరాని ఆకు ఒక్కటీ నాకు కనపడలేదు’ అన్నాడు. ‘అదేమిటీ! నువ్వు వీళ్లందరికంటే తెలివైనవాడివా?’ అని గురువు అంటే, ‘అలా కాదండీ ! మీరు నాకు వైద్యవిద్య నేర్పడం ప్రారంభించినప్పుడే ఒక శ్లోకం నేర్పారు. దాని ప్రకారం ఈ ప్రకృతిలో పనికిరానిదేదీ లేదు అని చెప్పారు!’ అన్నాడు.
‘ఏమిటా శ్లోకం?’ అని అడిగారు.
*అమంత్రమక్షరం నాస్తి*
*నాస్తి మూలం అనౌషధం*
*అయోగ్యః పురుషో నాస్తి*
*ప్రయోగః తత్ర దుర్లభః*
అని జీవకుడు శ్లోకం చెప్పాడు.
దీని అర్థం ఇది. ‘అమంత్రమక్షరం నాస్తి’ – అంటే ఏ భాషలోనూ మంత్రం కాని అక్షరం లేదు. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి. వీటిలో మంత్రానికి పనికిరాని అక్షరం లేదు. ఏ అక్షరం దేనికి బీజాక్షరం అనేదాన్లో తేడాలుంటాయి గాని, అన్ని అక్షరాలు బీజాక్షరాలే. అలాగే ‘నాస్తి మూలం అనౌషధం’ – అంటే వైద్యానికి పనికిరాని ఆకు కూడా ప్రపంచంలో లేదు. అలాగే ‘అయోగ్యః పురుషో నాస్తి’. అంటే పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు (ఇక్కడ పురుషః అంటే మగ అని కాదు, మనిషి అని అర్థం. అంటే మగ లేదా ఆడ అని). ఉపాధ్యాయుల బాధ్యత ఏమిటంటే ప్రతి విద్యార్థి దేనికి పనికొస్తాడో చెప్పడం. ‘నువ్వు దేనికీ పనికిరావు’ అని చెప్పకూడదు. అందరూ విద్యకే పనికిరారు. ‘నీకు చదువు రాదు కానీ నువ్వు పలానా పని చేసుకుంటే సుఖపడతావు’ అని చెప్పాలి. అంతేకాని ‘నీకు చదువు రాదురా అబ్బాయి! గొడ్లు కాసుకో’ అని తిట్టకూడదు. గొడ్లు కాయడం అంత తేలికైన పనేమీ కాదు. ఒకప్పుడు సాక్షాత్తూ పరమాత్ముడే మనిషి అవతారమెత్తి ఆ పని చేశాడు. కాబట్టి అది తక్కువ పనేమీ కాదు. మనం దానిని తక్కువగా చూడటంతో అదొక తిట్టు పదం అయింది. దాంతో ఆ పని చేసేవాళ్లు అవమానం చెందు తున్నారు. మన కులవృత్తులన్నీ ఇలాగే అయ్యాయి. మన సంస్కృతిలో ప్రతి పనికీ గౌరవం ఉంది. ఇక చివరి వాక్యం ‘ప్రయోగః తత్ర దుర్లభః’ – అంటే ఏ విషయం గురించి అయినా ముందు ప్రయోగం చేసి చూడాలి. అంటే పరిశీలించాలి. అంతేకాని ‘అది బాగోదు’ అని వెంటనే తీర్మానించకూడదు. 
‘ఈ శ్లోకాన్ని మీరు ముందే నాకు చెప్పారు గురువుగారూ..! అందుకే నేను ప్రయత్నం చేశాను. మీరు చెప్పినట్లుగా నాకు పనికిరాని ఆకు దొరకలేదు’ అన్నాడు జీవకుడు. వెంటనే గురువుగారు అతనికి వ్యతిరేక పరీక్ష పెట్టారు (క్రాస్‌ ఎగ్జామినేషన్‌). ‘మిగతా విద్యార్థులు పనికిరావంటూ తెచ్చిన ఆకులు దేనికి పనికొస్తాయో చెప్పు!’ అన్నారు. వెంటనే జీవకుడు ‘ఇదిగో ఇవి మారేడు ఆకులు, తేమ (నీటి తడి) ఉన్నచోట ఈ ఆకులు వేస్తే తేమను లాగేస్తాయి. అలాగే ఇది ఉత్తరేణి ఆకు. పళ్లు తోముకోడానికి పనికి వస్తుంది, ఇది ఫలానా ఆకు, అతిసారం తగ్గిస్తుంది’ అంటూ అన్ని ఆకుల గురించి, అవి దేనికి పనికొస్తాయనేది వివరంగా చెప్పాడు. గురువు బ్రహ్మమిత్రుడు ఆనందభరితు డయ్యాడు. వెంటనే
జీవకుడిని మెచ్చుకుని ‘నువ్వు ఒక్కడివే యోగ్యత గల శిష్యుడివి. నీకొక్కడికే నేను యోగ్యతా పత్రం ఇస్తున్నాను’ అని చెప్పి మిగిలిన విద్యార్థులను మరో ఏడాది చదవమని చెప్పారు. ఈ జీవకుడు తరువాత ఆయుర్వేద ఔషధాల తయారీలో ప్రసిద్ధి పొందాడు.ఇలా ‘ప్రతి మనిషి ఏదో ఒకదానికి పనికొస్తాడు, పనికిరాని మనిషి ఈ ప్రపంచంలో లేడు’ అని తీర్మానించుకుని ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయుడు తీర్చిదిద్దాలి. కొందరు ఆటలకు, కొందరు పాటలకు, మరికొందరు రచయితగాను, కార్యకర్తగాను లేదా కావ్యకర్తగాను ఏదో రంగంలో పనికొస్తారు. విద్యార్థికి చదువు చెబుతూనే అతను ఏ రంగంలో ఎదగగలడో గుర్తించి, ఆ విషయం విద్యార్థికి చెప్పి, ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఉపాధ్యాయుని విధి.ఇవాళ్టి పరిస్థితి ఇలా లేక, మూసపోసినట్లుగా ఒకేలా ఉంది. అందరూ ఇంగ్లీషు మీడియం చదవాలి; అందరూ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అవ్వాలి; అందరూ అమెరికా ప్రయాణం చెయ్యాలి. దాంతో మిగతా రంగాలలో మనుషులు దొరక్క, కొన్ని రంగాలలోనే డిమాండు ఎక్కువై, అందరి అవకాశాలు దెబ్బతిన్నాయి.ఈ సమస్యకు పెద్ద పరిష్కారం, మన శాస్త్రాలు సూచించినది ఈ బ్రహ్మమిత్రుడి కథ ‘అమంత్ర మక్షరం నాస్తి’. ఉపాధ్యాయులు దీనిని అవగాహన చేసుకుని ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి. ‘ఇది రాకపోతే పోయిందిలే.. ఇలాంటివి మరిన్ని పనులున్నాయి, కంగారు పడకు’ అని ధైర్యం చెప్పాలి. వెంటనే అతడికి ఉత్సాహం వస్తుంది. ఆ ప్రోత్సాహం లేకపోతే విద్యార్థి ఫెయిలయిన మరుక్షణం ఆత్మ హత్యకు పాల్పడుతున్నాడు. అందుకే విద్యా రంగంలో మార్పు ప్రారంభం కావాలి.( ప్రపంచంలో ఏది నిత్యం కాదు ఒక్క మార్పు తప్ప! Nothing is permanent Except  CHANGE...)

Related Posts