YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*కలశాన్ని ఎందుకు పూజించాలి?*

*కలశాన్ని ఎందుకు పూజించాలి?*

*కలశాన్ని ఎందుకు పూజించాలి?*
*కలశము అంటే ఏమిటి?*
నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది.  తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది.  అటువంటి పాత్ర ‘కలశం’ అనబడుతుంది.  ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది.  అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది.  స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.
*మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే?*
సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కలశంలొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత.  లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ'ను సూచిస్తుంది. అందువల్లనే 'కలశం' శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది. అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు "అభిషేకము''తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో  భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయ పూర్వకంగా స్వాగతమిస్తాము.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts