కడపలో కొత్త పరిశ్రమలకు రాని అనుమతులు
కడప,జూన్ 1,
కడపకు సమీపంలోని కొప్పర్తిలో 6800 ఎకరాలు నిరుపయోగంగా మారింది. ఈభూములకు సంబంధించి ప్రత్యేక లే ఔట్ తయారు చేసినప్పటికీ, దీనికి పర్యావరణ అనుమతి లేదంటూ ప్రభుత్వశాఖలు కొర్రి వేస్తున్నాయి.కడప జిల్లాలో కొత్త పరిశ్రమలు స్థాపిస్తాం, లక్షలాది మంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తాం, సేకరించిన భూముల్లో అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామంటూ నాలుగేళ్లక్రితం రాష్ట్రప్రభుత్వం చేసిన హామీ కలగా మిగిలిపోయింది. ఫలితంగా ఈప్రాంతంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదవిలో ఉన్నప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన చేయాలన్న ఉద్దేశ్యంతో అటు రైల్వేస్టేషన్ సమీపంలో , ఇటు కడప విమానాశ్రయానికి దగ్గరలోనూ చింతకొమ్మదినె్న మండలంలోని కొప్పర్తి పొలంలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు. ఆ ప్రాంతానికి కావాల్సిన అన్ని రకాల వౌళిక వసతులకోసం నిధులు కూడా మంజూరు చేశారు. సోమశిల బ్యాక్‌వాటర్ నుంచి కొప్పర్తి పారిశ్రామిక వాడకంకు నీరందించేందుకు కూడా పెద్ద ఎత్తున పైపులైన్ కూడా వేశారు. అయితే దీని వ్యవహారంపై రాష్టన్రీటిపారుదలశాఖ, కేంద్రపర్యావరణశాఖ పరిధిలో ఫైలు పెండింగ్‌లో ఉంది. ఫలితంగా నీటి సరఫరా వ్యవహారం డోలాయమానంగా మారింది. ఏడాదిగా కేంద్రం పర్యావరణ అనుమతిపై తేల్చకపోవడంతో ఇక్కడకు రావాల్సిన పరిశ్రమలు తరలిపోవడం కొత్తవాటికి అనుమతులు వస్తాయోలేదో తెలియని పరిస్థితులు ఉండటంతో పరిశ్రమలు పెట్టేందుకు చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాకు రావాల్సిన అనేక పరిశ్రమలు అటు అనంతపురం, ఇటు తిరుపతికి తరలిపోయాయి. ఇప్పటికే జిల్లాకు ఉపాధిహామీ కింద రూ.339కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి. దీని ద్వారా రోడ్లు, పైపులైన్లు, డ్రైనేజి, మొక్కలు నాటడం వంటి పథకాలు ఎన్నోచేపట్టే అవకాశాలున్నా, అధికారులు ఈ పారిశ్రామిక వాడపై దృష్టి పెట్టకుండానే ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధానంగా దేశంలోనే 135 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, అందులో కడప జిల్లా ఒకటి, ప్రత్యేకప్యాకేజి కింద ప్రతి ఏడాది ఈజిల్లాకు రూ.50కోట్లు నిధులు కూడా మంజూరవుతున్నాయి. పిఎంజివై కింద అనేక పరిశ్రమలు పెట్టుకునేందుకు పావలా వడ్డీరుణాలు కూడా మంజూరవుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు నిధులు పుష్కలంగా ఉన్నా, దీని అభివృద్ధి పరిచేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. మూడేళ్లక్రితం సుమారు 15 కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసినా, వౌలిక వసతులు లేకపోవడం, నీటి సమస్య ఉండటం, పర్యావరణ అనుమతులు లేకపోవడం వంటి పరిస్థితులు ఉండటం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకురాలేదు. కొప్పర్తి పరిధిలో 6800 ఎకరాలు ఉంది. ఈ భూమిని కూడా ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు కూడా గుర్తింపు పొందింది. దీనికి సమీపంలో ఎయిర్‌పోర్టు ఉండటం, రైల్వేస్టేషన్ ఉండటం వల్ల పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అనేక విధాల అందుబాటులో ఉంటుందని, అందరూ భావించినా దీని ప్రగతిమాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. ఇక్కడ ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తారని భావించినా, చివరకు ఇది కూడా ఆశ్చర్యార్థకంగా మారింది. ప్రభుత్వం రోజుకో ప్రాంతాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదికలు పంపడంతో ఈపారిశ్రామిక వాడ ఎందుకు ఉపయోగపడుతుందో అంతుపట్టడం లేదు.