మళ్లీ పెరిగిన సిమెంట్
కర్నూలు జూన్ 1,
సిమెంటు ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఓ వైపు కరోనాతో ఉత్పత్తి ఆగిపోవడమే కారణమన్న వాదన ఉంది. పెరిగిన ధరలు ఎండలను మించి నిర్మాణ రంగంపై భారాన్ని మోపుతున్నాయి. సిమెంటు కంపెనీలతో చర్చలు జరిపి ధరలు తగ్గించాలని హెచ్చరించినా స్వల్ప స్థాయిలో మినహా పెద్దగా ధరలు తగ్గలేదు. దీంతో నిర్మాణ రంగం కుదేలవుతుంది. ఎన్‌టిఆర్ పక్కా గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఆర్థికంగా అధిక భారమవుతుంది. భవన నిర్మాణ రంగంలో సిమెంటు కీలకం. సిమెంటు ధరల పై ఆధారపడి కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సిమెంటు ధరలు నానాటికి పెరుగుతుండడంతో భవన నిర్మాణ దారులపై మోయలేని భారం పడుతుంది. సిమెంటు ధరలు అధికంగా ఉండడంతో నిర్మాణ దారులు పనులు ప్రారంభించేందుకు వెనుకడుగు వేస్తున్నారు.వారం రోజుల క్రితం వరకు 53 సూపర్ గ్రేడ్ సిమెంటు వివిధ కంపెనీల ధరలు 50 కిలోల బ్యాగు గరిష్టంగా 385 రూపాయలు వరకు ఉన్నాయి. కొన్ని రోజుల నుండి ఈ ధరల్లో రూ.10 నుండి 20 వరకు తగ్గి రూ.320 నుండి 335 వరకు ఉన్నాయి. కంపెనీ బ్రాండ్‌లకు అనుగుణంగా ఈ ధరలు ఉంటాయి. ధరలతో పాటు రవాణా వ్యయం పెరిగింది. నిర్మాణాలు ప్రారంభించేవారు ఈ ధరలను చూసి వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. సిమెంటు ధర పై ప్రభుత్వం నియంత్రణ లేకుండా ఇష్టారీతిగా పెంచడం పై సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తక్షణమే సిమెంటు ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.సిమెంటు ధరలు పెరగడంతో నిర్మాణ రంగం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. దీంతో ఈ ప్రభావం భవన నిర్మాణ కార్మికుల పై పడుతుంది. నిర్మాణాలు నిలిచిపోవడంతో అన్నీ అనుబంధ రంగాల పై ప్రభావం చూపుతోంది.