YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరంపై నిఘా నేత్రం వేసవిలోగా డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పూర్తి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

పోలవరంపై నిఘా నేత్రం వేసవిలోగా డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పూర్తి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

వేలకోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసరప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 10 కెమేరాలతో పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నామని అధికారులు వివరించగా, పనుల పర్యవేక్షణతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫైబర్ నెట్తో పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పునారావాస కాలనీలను అనుసంధానం చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ముఖ్య భాగమైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ నిర్మాణాన్ని ఈ వేసవి అయ్యేలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులకు నిర్దేశించారు. పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి పనుల పురోగతిపై వర్చువల్ ఇన్స్పెక్షన్తో సహా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఇప్పటివరకు 52.10% పోలవరం ప్రాజెక్టు పూర్తికాగా, కుడి ప్రధాన కాలువ 89.10%, ఎడమ ప్రధాన కాలువ 58.30% పనులు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 71.10% మేర స్పిల్ వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు, 13.80% వరకు స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు, 79.40% డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, జెట్ గ్రౌంటింగ్ 58.06%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయినట్టు తెలిపారు. 

గత వారం రోజుల్లో 1.93 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 21 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 38.4 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. 

పోలవరం ప్రాజెక్టులో మొత్తంమీద 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 793.10 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 4.86 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్కు గాను 1,133.6 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,450 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. 

పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు మొత్తం రూ. 13,364.98 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ. 8,229.11 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో రూ. 5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ. 2,886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సివుందని చెప్పారు. 

ప్రభుత్వం చేపట్టిన 53 ప్రాధాన్య ప్రాజెక్టులలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభం కాగా, పెదపాలెం, చినసాన, పులికనుమ ఎత్తిపోతల పథాకాలు, ఓక్ టన్నెల్, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా వున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. 

సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts