YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో మరో ఫైర్ బ్రాండ్

తెలంగాణలో మరో ఫైర్ బ్రాండ్

తెలంగాణలో మరో ఫైర్ బ్రాండ్
హైద్రాబాద్, జూన్ 1,
తెలంగాణ కాంగ్రెస్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డిది విభిన్న శైలి. నిత్యం వార్త‌ల్లో ఉండే వ్య‌క్తి. సంగారెడ్డిలో బ‌ల‌మైన నాయ‌కుడు ఏటికి ఎదురీడి గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా అంతా టీఆర్ఎస్ హ‌వా న‌డిస్తే సంగారెడ్డిలో మాత్రం జ‌గ్గారెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగ‌రేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న స్టేట్ పాలిటిక్స్‌పై క‌న్నేశారు. అవ‌కాశం వ‌స్తే పీసీసీ అధ్య‌క్ష‌పీఠాన్ని ద‌క్కించుకొని కాంగ్రెస్‌ను న‌డిపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే స‌మ‌యంలో త‌న వార‌సురాలిని వీలైనంత త్వ‌ర‌గా రాజ‌కీయ తెర‌పైకి తీసుకురావాలని జ‌గ్గారెడ్డి భావిస్తున్నారు.బీజేపీతో రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన జ‌గ్గారెడ్డి అక్క‌డి నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లి 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.  తెలంగాణ ఉద్య‌మం ప‌తాక‌స్థాయిలో ఉన్న‌ప్పుడు ఆయ‌న స‌మైక్య‌వాదాన్ని వినిపించి వార్త‌ల్లో నిలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడారు. త‌ర్వాత బీజేపీలోకి వెళ్లి మెద‌క్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడారు. మ‌ళ్లీ బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా మూడోసారి విజ‌యం సాధించారు.ఆ ఎన్నిక‌ల ముందు జ‌గ్గారెడ్డి బాగా ఇబ్బంది ప‌డ్డారు. పాత కేసుల్లో ఆయ‌న ఎన్నిక‌లకు కొన్ని రోజుల ముందు జైలుకు వెళ్లారు. ఈ స‌మ‌యంలో జ‌గ్గారెడ్డి త‌ర‌పున ప్ర‌చార‌బ‌రిలోకి ఆయ‌న కూతురు జ‌యారెడ్డి దిగారు. నిండా 20 ఏళ్లు కూడా నిండ‌ని జ‌యారెడ్డి సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో దూసుకెళ్లారు. కాంగ్రెస్ శ్రేణులు, జ‌గ్గారెడ్డి అనుచ‌రుల అండ‌తో త‌ల్లిని ప‌క్క‌న‌పెట్టుకొని పెద్ద ఎత్తున నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం నిర్వ‌హించారు.ప్ర‌సంగాలు కూడా బాగా చేశారు. ఆమె మాట‌లు ప్ర‌జ‌ల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాయి. అప్పుడే ఆమెకు తండ్రికి త‌గ్గ వార‌సురాల‌ని, యువ ఫైర్ బ్రాండ్ అని ముద్ర ప‌డింది. అయితే, ఇంకా చ‌దువుకుంటున్న జ‌యారెడ్డి ఇప్పుడ‌ప్పుడే రాజకీయాల్లోకి రార‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, జ‌గ్గారెడ్డి మాత్రం త‌న కూతురుని వీలైనంత త్వ‌ర‌గా రాజ‌కీయరంగ ప్ర‌వేశం చేయించాల‌ని భావిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే త‌న కూతురి స‌త్తాను గుర్తించిన జ‌గ్గారెడ్డి ఆమెనే త‌న రాజ‌కీయ వార‌సురాల‌ని ఫిక్స్ అయిపోయారు.ఈ విష‌యాన్ని ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు కూడా. సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో సంగారెడ్డితో పాటు స‌దాశివ‌పేట్ మున్సిపాలిటీలు ఉన్నాయి. గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌దాశివ‌పేట్ ప్ర‌చార బాధ్య‌త‌లు కూడా జ‌యారెడ్డికి అప్ప‌గించారు జ‌గ్గారెడ్డి. ఇప్ప‌టికే ఆమెను కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం నేష‌నల్‌ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ)లోకి ఎంట్రీ ఇప్పించారు.ఇటీవ‌ల గాంధీ భ‌వ‌న్‌లో జ‌గ్గారెడ్డి ప్రెస్‌మీట్‌లో జ‌యారెడ్డి కూడా తండ్రి ప‌క్క‌నే కూర్చొని ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఇలా ఇప్ప‌టినుంచి జ‌గ్గారెడ్డి తన కూతురుని రాజ‌కీయాల కోసం అన్ని ర‌కాలుగా స‌న్న‌ద్ధం చేస్తున్నారు. అయితే, జ‌గ్గారెడ్డి వ‌య‌స్సు కేవ‌లం 54 ఏళ్లు మాత్ర‌మే. 80 ఏళ్ల వ‌య‌స్సు వారు కూడా రాజ‌కీయాలు చేస్తున్న ఈ కాలంలో జ‌గ్గారెడ్డికి ఇంకా చాలాకాలం రాజ‌కీయాల్లో ఉండే అవ‌కాశం ఉంది.అయినా కూడా ఆయ‌న వార‌సురాలిని తెర‌పైకి తెచ్చేందుకు ఆరాట‌ప‌డుతున్నారు. కాగా, ఇప్ప‌టికే ఆయ‌న స‌తీమ‌ణి నిర్మల కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉన్నారు. ఆమె ప్ర‌స్తుతం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షురాలిగా పని చేస్తున్నారు. ఇలా జ‌గ్గారెడ్డి దంప‌తులు ఫుల్‌టైమ్ రాజ‌కీయాల్లో ఉండ‌గానే కూతురిని తెర‌పైకి తెస్తున్నారు.

Related Posts