YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూన్ జరభద్రం....

జూన్ జరభద్రం....

జూన్ జరభద్రం....
న్యూఢిల్లీ, జూన్ 1,
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. రోజుకు ఆరువేల కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. నాలుగు విడత లాక్ డౌన్ ముగిసినప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే లక్షన్నర కేసులు దాటిపోయాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే యాభై వేల కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాలు కోవిడ్ కంట్రోల్ ను చేస్తున్నప్పటికి తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఆ యా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఫలితం కన్పించడం లేదు.ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. వలస కార్మికులను తరలింపుతో వైరస్ దేశ వ్యాప్తంగా మరింత వ్యాప్తిచెందుతోంది. త్రిపుర వంటి రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ లో ఉందనకున్నప్పటికీ కొత్తగా నమోదయిన కేసులు వలస కార్మికులవే కావడం విశేషం. దీంతో పాటు దేశీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మిషన్ వందేమాతరం కింద విదేశాల నుంచి భారతీయులను దేశానికి తీసుకువచ్చారు. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇక రైళ్లను కూడా పునరుద్ధరించడం కూడా వైరస్ వ్యాప్తి వేగవంతమవ్వడానికి కారణంగా చెబుతున్నారు.జూన్ నెలలో కరోనా వైరస్ వ్యాప్తి మామూలుగా ఉండదంటున్నారు. గత పదిరోజులుగా డెబ్భయి వేల కేసులు భారత్ లో నమోదయ్యాయి. ఇక జూన్ నెలలో పదిహేను లక్షల కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని నిపుణుల హెచ్చరించారు. వచ్చే నెలలో కేసులు దాదాపు పదిహేను లక్షలు దాటే అవకాశముందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ వెల్లడించింది.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తే ఈ సంఖ్య ఎక్కువయ్యే అవకాశముందని కూడా చెబుతున్నారు. దాదాపు పదిరెట్లు కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. రోజుకు యాభై వేల కేసులు నమోదయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకు ఆరు నుంచి ఏడువేల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమైనా, గ్రామీణ ప్రాంతాలకు వ్యాధిని విస్తరించకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద జూన్ నెల భారత్ కు కరోనా విషయంలో పరీక్షాకాలమే. దీన్నుంచి బయటపడాలంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఇంటికే పరిమితమయితే కొంత వరకూ కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు.

Related Posts