నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వాల రద్దు అంశంపై సుమారు నెల రోజులుగా జరిగిన వాదనలు ఇవాళ ముగిశాయి. దీనికి సంబందించిన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కాంగ్రెస్ నాయకుల తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన విషయం లిఖిత పూర్వకంగా తెలపలేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.తాము కోర్టును ఆశ్రయించిన తర్వాత గత నెల 19న గవర్నర్ సంతకంతో అసెంబ్లీ వెబ్‌సైట్లో ఉత్తర్వులు పెట్టారని... అయితే అందులో కూడా బహిష్కరణకు కారణాలు వివరించలేదని కాంగ్రెస్ నేతలు నివేదించారు. గవర్నర్ ప్రసంగం శాసనసభ సమావేశాల పరిధిలోకి రాదన్నారు. మండలి ఛైర్మన్ కంటికి గాయమైనందున బహిష్కరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని.. అయితే దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ అడిగితే ఇవ్వలేదన్నారు. కాబట్టి గతంలో సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుల ప్రకారం.. బహిష్కరణ ఉత్తర్వులు చెల్లుబాటు కావని వాదించారు. అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి రాజీనామా తర్వాత.. అసెంబ్లీ తరఫున ఎవరూ వాదనలు వినిపించలేదు. అయితే ఈరోజు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. బహిష్కరణ వ్యవహారంలో ప్రభుత్వం ప్రమేయం లేదని చెప్పారు. ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని.. అయితే ఆరు వారాలు ఆగాలన్న మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.