YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 టీపీసీసీ కోసం ప్రయత్నాలు

 టీపీసీసీ కోసం ప్రయత్నాలు

 టీపీసీసీ కోసం ప్రయత్నాలు
హైద్రాబాద్, జూన్ 1
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ.. చరిత్ర పాతదే అయినా.. అప్పటికి ఇప్పటికీ ఇందులో నడిచేది గ్రూపు రాజకీయాలే. ఇది రాజకీయమెరిగిన సత్యం. మన తెలుగు రాష్ట్రాలలో ఏపీలో ఆ పార్టీ గతాన్ని మరిచిన ప్రజలు.. భవిష్యత్ పై ఆశలు లేకుండా చేశారు. ఇక ఉన్న తెలంగాణలో ఆ గ్రూపు తగాదాలే పార్టీని దహించి వేస్తున్నాయి. ప్రత్యర్థి బలమైన వాడని తెలిసినపుడైనా కలిసికట్టుగా పనిచేసి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఆ ఒక్కటే ఆశించకూడదు.పేరుకి అంతా తలలు పండిన రాజకీయ మేధావులు. పైగా సగానికి సగం మంది వారసులు కూడా. అయినా ఎవరికి వారు ఎక్కి తొక్కాలన్నదే ఆశయంగా ముందుకు వెళ్తున్నారేమో అనిపిస్తుంది. అందుకే ప్రత్యర్థికి వీళ్ళని ముంచేయడం సులభమైపోతుంది. ఈమధ్య కొద్దిరోజులుగా కరోనా లాక్ డౌన్ తో కాస్త విరామమిచ్చిన రాజకీయాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్ళీ సిద్ధమైపోయారు. మళ్ళీ ఆ పీసీసీ రేసుకి కత్తి కట్టి రంగంలోకి దిగుతున్నారు. కాకపోతే ఈ క్రమంలో సొంత పార్టీలో కోళ్లనే కత్తిపోటుకి బలిచేయాలని చూస్తున్నారు. తాను బలైనా.. తన వలన ఇంకొకరు బలైనా అది తన కొంపకే ముప్పని తెలియనిదేంకాదు. కానీ పాత పార్టీ కదా.. అంత ఈజీగా మారదు. ప్రస్తుతానికి పార్టీకి బాస్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ ఇప్పటికే ఒకేసారి రిజైన్ చేసినా పార్టీ మళ్ళీ బ్రతిమాలి ఆయన్ని ఆ పదవిలో కూర్చోబెట్టింది.అందుకు కారణం అప్పుడు పార్టీ అధిష్టానం ఈ తగాదాలకే భయపడింది. అసలే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎందుకొచ్చిన తంటా అని వెనక్కు తగ్గింది. ఆ ఎన్నికలు అయ్యాక పిసిసి పదవికి సంప్రదింపులు మొదలుపెడితే ఎవరికి వారు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి ఆ పదవికి మనసు పడిన మాట ఆ పెద్దల ముందు పెట్టారు. ఈలోగా కరోనా దేశంలో అందరినీ మూలాన కూర్చోబెట్టింది.ఇప్పుడు ఆ కరోనాకు సడలింపులు వచ్చినట్లుగానే రాజకీయాలకు సడలింపులు మొదలయ్యాయి. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పాలిటిక్స్ మళ్ళీ మొదలయ్యాయి. తాజాగా ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీనిని మళ్ళీ తెరమీదకి తెచ్చారు. ఒకవైపు తాను ఆ రేసులో ఉన్నానని చెప్తూనే.. రేవంత్ రెడ్డికి మాత్రం ఆ పదవి దక్కకుండా శాయశక్తులా పోరాడతానని ఓపెన్ గా చెప్పేశారు.ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పగించినా తనకు అభ్యంతరం లేదన్న జగ్గారెడ్డి మరొకరికి ఇచ్చే ఆలోచనలో ఉంటే మాత్రం తనకి మించిన అర్హతలు ఇంకెవరికి లేవన్నది తన ఫీలింగ్ అని చెప్పుకున్నారు. ఇక రేవంత్ రెడ్డికి పిసిసి పదవి అప్పగిస్తే మాత్రం తన రాజకీయం తాను చేస్తానని.. ఏం చేయాలో కూడా ఇప్పటికే తన వద్ద ప్రణాళికలు సిద్ధమని చెప్పేశారు.నిజానికి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నది పార్టీలో నేతల నోటి నుండి రావాల్సిన మాట. కానీ ఇక్కడ ఓపెన్ గానే తనకి నచ్చని వాళ్ళని ఇస్తే ఒప్పుకునేది లేదని చెప్పేస్తున్నారు. పైగా అధిష్టానం వద్ద కూడా ఇదే మాట చెప్తామని మనకి చెప్పేశారు. కాగా, కరోనాకు ముందే పీసీసీ కొత్త చీఫ్ నియామకం ఢిల్లీలో జరిగిపోయిందన్నది అప్పుడే ముమ్మర ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డిపై ప్రభుత్వం కేసులు పెట్టడం.. వారం రోజులుగా చర్లపల్లి జైల్లో ఉంచడం అన్నీ కలిసి తనకే పిసిసి పదవి వరించిందని ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు జగ్గారెడ్డి దాని ప్రకారమే తాజా వ్యాఖ్యలు చేశారా? రేవంత్ రెడ్డికి పదవి ఖరారైతే తన ప్రణాళిక ఏమై ఉంటుంది? జగ్గారెడ్డి బాటలో అసంతృప్తులు ఎంతమంది? ఆశలు ఎన్నాళ్లీ దాగుడుమూతల పిసిసి గేమ్? గుట్టు విప్పేస్తే పోలే!

Related Posts