YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం

 నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం

 నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం
విజయవాడ, జూన్ 1,
ఎక్కడ తప్పు ఎవరికి ఒప్పు ఎవరిది అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే రెండు వైపులా అది కనిపిస్తోంది కాబట్టి. ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారమే తీసుకుంటే మార్చి 15 వరకూ ఆయన చాలా మామూలుగానే కనిపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి మరీ జగన్ ఆయన కుల ప్రస్తావన తెస్తే జగన్ దే తప్పు అని అంతా అనుకున్నారు. అంతవరకూ నిమ్మగడ్డ విషయంలో అయ్యో పాపం అనుకున్నారంతా.కానీ ఆయన ఒక్కసారిగా కేంద్ర హోం శాఖకు లేఖ రాశారని ప్రచారం కావడం, దాన్ని ఆయన ఖండించకుండా సైలెంట్ గా పొగ రాజేయడం చూసినా, ఈ లేఖలో పదాలు రాజకీయ పరిభాషలో ఉండడం వంటివి చూసినపుడైనా అమ్మో నిమ్మగ‌డ్డ అనిపించకమానదు.సరే ఇది కూడా ఆయన ఉక్రోషమ‌ని సరిపెట్టుకున్నా కూడా ఆ తరువాత ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చిందని సీఐడీ ద్వారా ఆరా తీసినపుడు ఏకంగా పెన్ డ్రైవ్ ద్వారా ఆధారాలు కూడా ద్వంసం చేశారన్న సమాచారం రావడంతో నిమ్మగడ్డ సామాన్యుడు కాడు అని రాజకీయాలు తెలిసిన వారికీ తెలియని వారికీ కూడా అర్ధమైపోయింది. ఇక నిమ్మగడ్డను అకస్మాత్తుగా తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినపుడు కూడా అయ్యో అని కొంతమందికైనా అనిపించింది. ఇక హైకోర్టులో నిమ్మగడ్డకు మద్దతుగా ఏకంగా పదమూడు పిటిషన్లు పడ్డప్పుడు ఆయన ఒంటరి వాడు కాదు బాగానే మద్దతు ఉందనిపించింది.నిమ్మగడ్డను తొలగించే విషయంలో ప్రభుత్వం ఆదరాబాదరాగా తెచ్చిన ఆర్డినెన్స్ లో లోపాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎపుడూ ఒకరికి విజయం కాదు, మరొకరికి అపజయం కానే కాదు, ఎందుకంటే అక్కడ రాజ్యాంగబధ్ధత. న్యాయ‌పరమైన అంశాలే చూస్తారు. సరే నిమ్మగడ్డకు కోర్టులో కొంత ఊరట వచ్చింది. అంతమాత్రం చేత నిమ్మగడ్డ ఇంత హడావుడి చేయాలా. ఏకంగా స్టాండింగ్ కౌన్సిల్ ని మార్చేయాలనుకోవాలా. ఒక సెలెక్టెడ్ పోస్ట్ లో నామినెట్ అయిన అధికారికే ఇంత అహంకారం ఉంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అందునా బంపర్ మెజారిటీ వచ్చిన వారికి మరెంత ఉండాలన్నది కూడా అందరికీ తట్టే ఆలోచనే కదా.నిమ్మగడ్డకు బయట మద్దతు ఉండొచ్చు, మానవచ్చు కానీ ఆయన ఎవరి ఆధారం లేకుండా స్వయంసిధ్ధంగా పనిచేయాల్సిన అధికారి. రాజ్యాంగబధ్ధమైన పదవిలో ఆయన అన్నింటికీ అతీతంగా ఉండాలి. కానీ ఆయన ప్రభుత్వానికి ఎదురునిలిచి తాను గెలిచాననుకుని తొడగొడితే రేపటి రోజున అదే సర్కార్ తో కలసి పనిచేయగలరా. ఆయన ఎంతైనా ప్రభుత్వంతోనే తన విధులను నిర్వహించాలి. ఆయన ఇచ్చిన ఆదేశాలు సైతం అమలు చేసేందుకు రాష్ట్ర యంత్రాంగమే ఉండాలి. ఇక ఆయన ప్రతీ దానికీ కోర్టు తలుపు తట్టి ప్రభుత్వంతో పని చేయించలేరుగా. ఇంతలా ప్రత్యర్ధులుగా మారిన తరువాత ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలు సజావుగా సాగుతాయా అన్న డౌట్లు వస్తున్నాయి. అంతే కాదు ఆయన పొడ గిట్టని ప్రభుత్వం ఒక వైపు, అదే ప్రభుత్వం మీద కక్ష సాధిద్దామన్న కాంక్షతో నిమ్మగడ్డ మరో వైపు ఉంటే ఏపీలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు, ఇక నిమ్మగడ్డను కొనసాగించరాదని ప్రభుత్వం శతధా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఆయనే కనుక కొనసాగితే ఎన్నికలనే ప్రభుత్వం మరో ఏడాది వాయిదా వేసుకున్న ఆశ్చర్యం లేదు అంటున్నారు ఇప్పటి సీన్ చూసిన వారంతా.

Related Posts