హైద్రాబాద్ లో దోమలపై ద్రోన్
హైద్రాబాద్, జూన్ 1,
దోమ.. పేరుకు చిరు ప్రాణే కావచ్చు.. కానీ గ్రేటర్ నగరాన్ని గడగడలాడిస్తోంది. మురికి కాల్వలు, గుర్రపు డెక్కు ఉన్న చెరువుల్లో దాక్కుని నగరంపై దాడిచేస్తోంది. డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలను విస్తరిస్తున్న ఈ ప్రాణి బెడదను వదిలించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతంత మాత్రమే ఫలితాన్నిచ్చాయి. చెరువుల్లో దోమల నివారణ జీహెచ్‌ఎంసీ కార్మికులకు అసాధ్యంగా మారిన నేపథ్యంలో అధికారులు గచ్చిబౌలి టీ–హబ్‌లో స్టార్టప్ సంస్థగా రూపుదిద్దుకున్న ‘మారుత్ డ్రోన్స్’ సంస్థ సహకారం తీసుకున్నారు. ఇప్పటికే మియాపూర్‌లోని గురునాథం చెరువులో డ్రోన్ ద్వారా దోమల మందు పిచికారీ చేపట్టారు.రాయదుర్గంలోని మల్కం చెరువులోను, మూసీ నదిపైన, బాపూఘాట్ వద్ద నుంచి హైకోర్టు వరకు ఈ డ్రోన్లతో దోమల మందును పిచికారీ చేశారు. డ్రోన్ పనితీరును జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, జోనల్ కమిషనర్ హరిచందన స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో మరిన్ని చోట్ల కూడా డ్రోన్లను వినియోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం, టీ–హబ్ సహకారంతో పలు రకాల డ్రోన్‌ల తయారీకి మారుత్ డ్రోన్ సంస్థ శ్రీకారం చుట్టింది. దీంతో మూడు నెలల క్రితం జీహెచ్‌ఎంసీ దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘డ్రోన్’ వార్ విజయవంతం కావడంతో గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో సర్జికల్ స్ట్రయిక్ చేయాలని నిర్ణయించారు. దోమల నివారణకు వినియోగిస్తున్న డ్రోన్ల సృష్టికర్త బాలాపూర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ విస్లావత్. ఐఐటీ గౌహతిలో బీటెక్ ఈసీఈ పూర్తిచేసిన ఈయన టీ–హబ్ సహకారం తీసుకుని, మరో ఇద్దరు మిత్రుల సహకారంతో మారుత్ డ్రోన్స్ సంస్థను నెలకొల్పారు. ఇందులో దోమల నివారణకు, వ్యవసాయానికి ఉపయోగపడేలా రెండు రకాల డ్రోన్‌లను తయారు చేశారు. ప్రస్తుతం డ్రోన్లకు గల 15 లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌లో మందును నింపి చెరువుల్లోని దోమలపై పిచికారీ చేస్తున్నారు. ఈ డ్రోన్లు చెరువు, మురికి కాల్వలపై ఆరడుగుల ఎత్తులో ఎగురుతూ మందును చల్లుతుంది. ఇలా గంటకు ఐదు నుంచి ఆరెకరాల విస్తీర్ణంలో డ్రోన్ తిరుగుతుంది. ఒక రోజులో 25 ఎకరాల వరకు పిచికారీ చేయవచ్చని సదరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు