అమెరికాలో పెట్రేగుతున్న హింస
న్యూయార్క్. జూన్ 1,
జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ పట్ల మినియాపొలీస్ సిటీకి చెందిన ఓ పోలీస్ అధికారి క్రూరంగా వ్యవహరించి అతడి చావుకు కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అమెరికాలో మెల్లగా చిచ్చు రేగుతోంది.గతవారం నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పట్ల మినియాపొలిస్ పోలీసులు అమానుషంగా వ్యవహరించి, అతడికి చావుకు కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అమెరికాలో మరోసారి ఐ కాంట్ బ్రీత్ ఉద్యమం ఊపందుకుంది. ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు. తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఈ ఘటనలో నలుగురు పోలీసులను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ''నల్లవాడిగా పుట్టడం మరణశిక్షకు అర్హత కాదు'' అని నగర మేయర్ బిల్ డి బ్లాసియో వ్యాఖ్యానించారు. మేయర్ వ్యాఖ్యల తర్వాత ఆందోళకారులు మరింత రెచ్చిపోయారు. పలు షాపులను ధ్వంసం చేసి కొన్నింటికి నిప్పుపెట్టారు. ఈ వ్యాఖ్యలపై బ్లాసియో క్షమాపణలు చెప్పారు. వారిని కించపరచాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని, దానిని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.అమెరికా వ్యాప్తంగా పలు నగరల్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. నిరసనకారులు రాళ్లు రువ్వి, బారికేడ్లను దాటుకుంటూ పోలీసులపై దాడి చేశారు. వైట్‌హౌస్ బంకర్‌లో ఆశ్రయం పొందాలని పోలీసులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇక, ఈ ఉద్యమం వెనుక వామపక్ష అతివాద గ్రూప్‌ల పాత్ర ఉందని ట్రంప్ ఆరోపించారు.నిరసనకారులను ఉగ్రవాదులంటూ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ పేర్కొన్నారు. వారు ఏవరైనప్పటికీ, ఉగ్రవాదులు వచ్చి మా నగరాలను తగలబెట్టారు.. దీనిపై మేము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికి మొత్తం 4,000 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ ఆందోళనలు ఐరోపాకు చేరాయి. లండన్, బెర్లిన్‌లో ఆదివారం వందలాది మంది వీధుల్లోకి వచ్చి ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా ఆందోళనలు నిర్వహించారు. ‘నో జస్టిస్.. నో పీస్’ పేరుతో మధ్య లండన్‌లోని ట్రఫల్గర్ స్క్యేర్ వద్ద ఆందోళన మొదలై.. పార్లమెంట్ మీదుగా అమెరికా ఎంబసీ వద్ద ముగిసింది.అమెరికా ఎంబసీ వద్ద ఐదుగురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్టు మెట్రోపాలిటిన్ పోలీసులు తెలిపారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసులను కించపరిచారని అధికారులు తెలిపారు. బెర్లిన్‌లోని అమెరికా ఎంబసీ వద్ద కూడా వందలాది మంది ఆందోళనకారులు చేరుకుని నిరసన తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలని, నల్లజాతీయుల చావులను ఆపాలని డిమాండ్ చేశారు.న్యూయార్క్‌లో 2014లో ఎరిక్ గార్నర్ అనే నల్లజాతి వ్యక్తిని హత్య తర్వాత అమెరికాలో జాతివివక్ష దాడులపై ఆందోళనలు పెరిగాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరుతో ఆందోళకారులు ఈ తరహా దాడులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇండియానాపొలిస్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డెట్రాయిట్, మినియాపొలిస్‌లో ఒక్కొక్కరు చనిపోయారు. అట్లాంటా, చికాగో, డెన్వర్, లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్ సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. వాషింగ్టన్ సహా 15 నగరాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సైన్యాన్ని మోహరించారు.