ఖరీఫ్ కు సిద్ధమౌతున్న రైతన్న
అనంతపురం,జూన్ 2,
జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ ఆరంభం అవుతుంది. ఈ ఏడాది ముందస్తుగా రుతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఖరీఫ్ ముందే ప్రతి రైతు తమ భూమిలో భూసార పరీక్ష చేయించుకుంటే బాగుంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భూ సారాన్ని బట్టి అనుకూలమైన పంటలను మాత్రమే వేసుకోవాలి రానున్న ఖరీఫ్‌లో ఏ భూముల్లో ఎలాంటి పంటలు వేయాలి. ఎరువులు, పంటల యాజమాన్యం, దుక్కులు దున్నడం తదితర అంశాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెపుతున్నారు.ఎరువుల యాజమాన్య పద్ధతులను రైతులు సరిగ్గా పాటించాలి. భాస్వరం, ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. నత్రజని, ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. పంటకు వేయాల్సిన పొటాషియాన్ని సగం దుక్కితో వేయాలి. సగం పంటకు వేయాలి. యూరియాను నేరుగా కాకుండా వేప పిండితో గానీ, బంక మట్టితో గానీ కలిపి వేయాలి. ఇలా చల్లుకున్నట్లయితే యూరియా ఆవిరికాకుండా ఉండడంతో పాటు 100 శాతం పంటకు ఉపయోగపడుతుంది. వరికి, పత్తికి రెండో విడతగా భాస్వారాన్ని అసలు వాడకూడదు.జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకం ద్వారా భూసార పరీక్షలు నిర్వహిస్తే భూమిలో సేంద్రియ పదార్థాం తక్కువగా ఉందని తెలిసింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు సంకేతం. ఇప్పటికైనా ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాల్సిందే. ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం వల్ల పంటల దిగుబడిలో పలు సమస్యలు ఎదురవుతాయి. పశువుల ఎరువులు, వర్మీకంపోస్టు ఎరువుల ద్వారా భూసారం పెరగడంతో పాటు నాణ్యమైన దిగుబడిని కూడా సాధించవచ్చు. రైతుకు సరిపడ విత్తనాలు సబ్సిడీ పంపిణీ చేసేందుకు సిద్ధం చేశాం. రైతులకు పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతోంది. భూసారానికి అనుగుణంగా ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి. దీంతో భూసారం పాడవుకుండా ఉంటుంది. భూసార పరీక్ష ద్వారా భూమిలో ఉన్న పోషక స్థాయిని తెలుసుకోవచ్చు. భూమిలో ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుస్తుంది. చౌడు నేలల్లో ఉన్న ఆమ్ల, క్షార నేలలను తెలుసుకుని భూమిని సరిదిద్దుకోవచ్చు. పత్తి సాగు చేసే రైతు తన భూమిలో పంట మార్పిడి చేయాలి. నాలుగు ఎకరాల్లో పత్తి వేస్తారనుకుంటే ఎకరంలో పత్తివేసి మిగత మూడు ఎకరాల్లో ఇతర పంటలు వేసుకోవడం మంచిది. ఆశించిన స్థాయిలో పంటలు పండాలని రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. గుమ్మఘట్ట మండల వ్యాప్తంగా 14 వేల హెక్టార్లలో వేరుశనగ సాగయ్యే అవకాశం ఉంది.