ఐసీఐసీ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్ కు ఉచ్చు బిగుస్తోంది...ఇప్పటికే క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త, నూపవర్ రెన్యువబుల్స్ సంస్థ అధిపతి దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు సంస్థల అధిపతి వేణుగోపాల్ ధూత్ విదేశాలకు పారిపోకుండా సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసింది. మరో వైపు స్కాంతో బ్యాంకు మీద మచ్చలు పడకుండా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. వీడియోకాన్ సంస్థకు రుణం ఇచ్చిన విషయంలో ఐసీఐసీఐ బ్యాంకులో అలజడితో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ఆర్బీఐ సైతం ఎప్పటికప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు యాజమాన్యంతో సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఐసీఐసీఐ యాజమాన్యంపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఎప్పటికప్పుడు బ్యాంకు అప్రమత్తమవుతోంది. దీంతో కొంత మంది బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై చందాకొచ్చర్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నారు. చందా కొచ్చర్ భర్త దీపక్ కచ్చర్, వీడియోకాన్ గ్రూప్ మధ్య సంబంధాల గురించి దర్యాప్తు సంస్థలు కొంత సమాచారం బయటపెట్టడంతో.. ఐసీఐసీఐ బోర్డు స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది.మరో వైపు చందాకొచ్చర్ మీద ఐసీఐసీఐ యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించేటట్లు కనబడటం లేదు. ఆమె భవిష్యత్ సంబంధించిన నిర్ణయాన్ని ఆమె స్వేచ్చకే వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియోకాన్ గ్రూప్ యాజమాన్యంతో చందాకొచ్చర్ భర్తకు వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో వీడియోకాన్ రుణ విషయంలో అవకతవకలు ఉండొచ్చని, సీబీఐ ఈ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతోంది. అందుకు సంబంధించి చందాకొచ్చర్ మరిది రాజీవ్ కొచ్చర్‌ను సైతం సీబీఐ ప్రశ్నించింది.ఇప్పటికే మార్చి 28న సమావేశమైన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు చందాకొచ్చర్ పైన పూర్తి విశ్వాసం ఉన్నట్లు ప్రకటించింది. మళ్లీ బ్యాంక్ ఇన్ సాల్వెన్సీ కేసులకు సంబంధించి సైతం ఏప్రిల్ 2న బోర్డు సమావేశమైనప్పుడు సైతం చందాకొచ్చర్ భవిష్యత్ మీద ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కొంత మంది డైరెక్టర్లు ఈ రెండు సమావేశాలకు హాజరు కాలేదు. ప్రస్తుతం బ్యాంకు మీద పెట్టుబడిదారుల నమ్మకం పోతుండటం, నైతికంగా బ్యాంకు మీద మచ్చలు వస్తుండటం వంటి పరిణామాలతో... ఈ వారం బ్యాంకు బోర్డు సమావేశమవుతుందని, ఇందులో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.ప్రైవేటు రంగంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందా కొచ్చర్.. వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త, నూపవర్ రెన్యువబుల్స్ సంస్థ అధిపతి దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు సంస్థల అధిపతి వేణుగోపాల్ ధూత్ విదేశాలకు పారిపోకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేస్తూ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని బట్టి చూస్తుంటే సీబీఐ అధికారులు రేపో మాపో ఈ ముగ్గురినీ అరెస్టు చేయవచ్చన భావన కలుగుతున్నది. ఇటీవలి కాలంలో పలువురు ఆర్థిక నేరగాళ్లు దేశం నుంచి జారుకున్న నేపథ్యంలో సీబీఐ ముందు జాగ్రత్త చర్యగా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.