గాడిలోపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ : ప్రధాని మోదీ
న్యూ ఢిల్లీ జూన్ 2
భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) 125వ సంవత్సరం సందర్భంగా ఆర్థికవేత్తలను ఉద్దేశించి ఇవాళ ప్రధాని మాట్లాడారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, అన్‌లాక్ వన్‌తో ఆ ప్రక్రియ మొదలైనట్లు ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా మళ్లీ వృద్ధి సాధిస్తామన్నారు. నేనింత దృఢవిశ్వాసంతో ఎలా ఉన్నానని మీరు ఆశ్చర్యపోతారని, భారతీయ నైపుణ్యం, ఆవిష్కరణ మీద తనకు నమ్మకం ఉన్నదన్నారు. కష్టపడే తత్వం, అకుంఠితదీక్ష మన వ్యాపారవేత్తలకు ఉన్నట్లు ఆయన తెలిపారు. మనం లాక్‌డౌన్ దశ నుంచి అన్‌లాక్ దశకు చేరుకున్నామంటే.. ప్రగతి పథం మళ్లీ మొదలైనట్లే అని మోదీ అన్నారు. భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చాలంటే.. ఉత్సాహాం, సమష్టితత్వం, పెట్టుబడి, మౌళికసదుపాయాలు, ఆవిష్కరణలు అవసరమని ప్రధాని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను.. మేడ్ ఫర్ ద వరల్డ్‌గా తయారు చేయాలన్నారు.