రంగంలోకి సైన్యం.. ట్రంప్ హెచ్చరిక
న్యూ ఢిల్లీ జూన్ 2
అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆందోళనకారుల్ని తరిమేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపనున్నట్లు ఆయన హెచ్చరించారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మిన్నియాపోలీస్ పోలీసుల చెరలో చనిపోవడంతో.. అమెరికా అంతటా నిరసనలు హోరెత్తాయి. అనేక నగరాల్లో బీభత్సం సృష్టించారు. వైట్‌హౌజ్‌ను కూడా దిగ్భంధించారు. ఓ దశలో భద్రతా దళాలుట్రంప్ను శ్వేతసౌధంలోని బంకర్లోకి కూడా తీసుకువెళ్లారు. వైట్‌హౌజ్ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ నగరాలు, రాష్ట్రాలు తమ ప్రజల్ని కాపాడలేకపోతే, అప్పుడు ఆర్మీని రంగంలోకి దింపనున్నట్లు ట్రంప్ తెలిపారు. పెద్ద పెద్ద నగరాల్లో కర్ఫ్యూ విధించారు. న్యూయార్క్ సిటీలో కూడా కర్ఫ్యూ విధించారు. సాయంత్రం వైట్‌హౌజ్ రోజ్ గార్డెన్ వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో బయట ఆందోళనకారుల్ని చెదరగొడుతున్న శబ్ధాలు వినిపించాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల ప్రతి అమెరికన్ పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారని, కానీ కొందరి ఆగ్రహానికి ఎవరూ బలికావద్దు అని అన్నారు. దేశరాజధానిలో జరుగుతున్న లూటీలు, హింస.. అవమానకరమని తెలిపారు. వాషింగ్టన్ డీసీకి వేలాది మంది సైనికులను, పోలీసు అధికారుల్ని మోహరిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. లూటీలు, విధ్వంసం, దాడులు ఆపేందుకు, ప్రాపర్టీలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హింసకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు ఉంటాయన్న సందేశాన్ని ఆయన వినిపించారు.